ఆల్‌ ఇంగ్లండ్‌: ఈసారైనా దక్కేనా!

14 March, 2018 - 1:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌‌షిప్‌. జీవితంలో ఒక్కసారైనా ఈ టోర్నీ విజేతగా నిలవాలని ప్రతీ షట్లర్‌ కలలుగంటారు. ఒలింపిక్స్‌‌లో స్వర్ణం సాధించినా, ప్రపంచ చాంపియన్‌‌షిప్‌ గెలిచినా, ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌‌షిప్‌ గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఈ చాంపియన్‌‌షిప్‌ గెలిస్తే దక్కే గౌరవం అంతా ఇంతా కాదు.

టెన్నిస్‌‌కు వింబుల్డన్‌ ఎలాగో బ్యాడ్మింటన్‌‌కు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ అలా. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టోర్నీ ఇది మరి. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్ మొదలైన సంవత్సరం 1898. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇదే అత్యంత పురాతన టోర్నీ. ఇప్పుడు జరగబోయేది 108వ టోర్నీ. భారతదేశం నుంచి 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్‌ ఈ టోర్నీలో విజేతలుగా నిలిచారు. ప్రకాశ్‌ పదుకోనె ఆల్‌ ఇంగ్లండ్‌ ట్రోఫీ అందుకుని సుమారు 38 ఏళ్లయింది. గోపీచంద్‌ ఈ టోర్నీ నెగ్గి 17 ఏళ్లు దాటాయి. అయితే గోపీచంద్‌ కోచ్‌‌గా మారిన తర్వాత భారత బ్యాడ్మింటన్‌ ముఖచిత్రమే మారిపోయింది. గోపీచంద్ శిక్షణలో అద్భుతమైన షట్లర్లు తెరపైకి వచ్చారు.

సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఏకంగా ఒలింపిక్స్‌‌లో మన దేశానికి పతకాలు అందించారు. కానీ ఆల్‌ ఇంగ్లండ్‌ మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. పదిసార్లు ఈ టోర్నీకి వెళ్లిన సైనా నెహ్వాల్‌‌కు 2015లో అందినట్లే అంది చేజారింది. ఆనాడు సైనా రన్నరప్‌‌గా నిలిచింది. ఇక, ఈ టోర్నీలో ఐదు సార్లు బరిలోకి దిగిన సింధు అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్‌ ఫైనలే కావడం గమనార్హం. దీంతో సింధు ఈసారి టోర్నీలో తన చెత్త ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బుధవారం ప్రారంభమై ఆదివారం వరకు జరుగుతుంది. పురుషుల విభాగంలో స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ అద్భుతమైన ఫామ్‌‌లో ఉన్నాడు. గాయం కారణంగా ప్రపంచ చాంపియన్, నంబర్‌ వన్‌ విక్టర్‌ అక్సెల్‌‌సన్‌ (డెన్మార్క్‌) ఈ టోర్నీకి దూరం కావడంతో భారత స్టార్‌ శ్రీకాంత్‌‌కు నెంబర్ వన్ అయ్యే అవకాశం వచ్చింది.

24 ఏళ్ల శ్రీకాంత్‌‌కు 75,695 పాయింట్లు ఉన్నాయి. అక్సెల్‌‌సన్‌ కన్నా 3,885, లీ చోంగ్‌ వీ కంటే 1,229 పాయింట్లు వెనకబడి ఉన్నాడు. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌‌లు గెలుచుకుని శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడు. అదే జోరును కొనసాగించి ఆల్‌ ఇంగ్లండ్‌ విజేతగా నిలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్‌ నెంబర్‌‌వన్‌ అవుతాడు.

కానీ.. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదని శ్రీకాంత్ అన్నాడు. ఇక్కడ ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు. తన సన్నాహాలు అద్భుతంగా ఉన్నాయని, నాలుగు వారాల సమయం చిక్కడంతో మెరుగైన శిక్షణ తీసుకున్నానని అన్నాడు. శ్రీకాంత్‌ టైటిల్‌ నెగ్గకపోయినా, కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ చేరినా… మరోవైపు లిన్‌ డాన్‌ (చైనా), లీ చోంగ్‌ వీ (మలేసియా), చెన్‌ లాంగ్‌ (చైనా) తొందరగా నిష్క్రమిస్తే అతనికి నెంబర్‌ వన్‌ అయ్యే అవకాశం ఉంటుంది.భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌‌లో శ్రీకాంత్‌, సాయి ప్రణీత్, ప్రణయ్‌, మహిళల సింగిల్స్‌‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి ఉన్నారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌‌ల్లో బ్రైస్‌ లెవెర్‌‌డెజ్‌ (ఫ్రాన్స్‌)తో శ్రీకాంత్‌… ఐదో సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)తో సాయి ప్రణీత్‌… ఎనిమిదో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో ప్రణయ్‌ తలపడతారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సైనా నెహ్వాల్‌… పోర్న్‌‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌‌లాండ్‌)తో సింధు ఆడనున్నారు. భారత క్రీడాకారులందరికీ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురవడంతో టైటిల్‌ వేటలో ముందంజ వేయాలంటే వారు ప్రతీ మ్యాచ్‌‌లోనూ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌‌లో మార్కస్‌ ఇలిస్‌-లాంగ్‌‌రిడ్జ్‌ (ఇంగ్లండ్‌)లతో సుమీత్‌‌రెడ్డి- మనూ అత్రి… టకురో హోకి- కొబయాషి (జపాన్‌)లతో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ఆడతారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌‌లో షిహో తనక- యోనెమోటో (జపాన్‌)లతో మేఘన- పూర్వీషా… మత్సుతోమో- తకహాషి (జపాన్‌)లతో సిక్కి రెడ్డి- అశ్విని పొన్నప్ప తలపడతారు. మిక్స్‌‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌‌లో మార్విన్‌- లిండా (జర్మనీ)లతో సిక్కి- ప్రణవ్‌ చోప్రా ఆడనున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య కొత్తగా రూపొందించిన ‘1.15 మీటర్ల సర్వీస్‌ నిబంధన’ను ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం సర్వీస్‌ చేసేటప్పుడు షటిల్‌‌ను తాకే సమయంలో రాకెట్‌.. కోర్టు ఉపరితలం నుంచి 1.15 మీటర్ల (3.8 అడుగులు)కు మించి ఎత్తులో ఉండకూడదు. అది దాటితే ఫౌల్‌‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం షట్లర్లు దాదాపు నడుము భాగం వద్ద షటిల్‌ ఉంచి సర్వీస్‌ చేస్తున్నారు. ఇది పొడుగుగా ఉన్న ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అంశం. సింధు, ప్రణయ్‌, సాత్విక్‌ ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారో చూడాలి.

మొత్తం 10 లక్షల డాలర్ల ప్రైజ్‌‌మనీ గల ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 70 వేల డాలర్ల (రూ. 45,31,000) చొప్పున లభిస్తాయి. దాంతో పాటు 12 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు వారి ఖాతాలో చేరుతాయి. రన్నరప్‌‌గా నిలిచిన వారికి 34 వేల డాలర్లు (రూ. 22 లక్షలు), 10,200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభిస్తాయి.

తొలి రోజు ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 నుంచి) మ్యాచ్‌లు మొదలై రాత్రి 11 గంటలకు (తెల్లవారు జాము 4.30 వరకు) ముగుస్తాయి. బుధవారం మొత్తం ఐదు కోర్టుల్లో 80 మ్యాచ్‌‌లు నిర్వహిస్తారు.