తమిళనాడు తీరప్రాంతాల్లో హైఅలర్ట్

25 August, 2019 - 6:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కోయంబత్తూర్‌: భారతీయ నేవీలో హై అలర్ట్‌ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు టెర్రరిస్టులు తమిళనాడులోకి సముద్ర మార్గం ద్వారా చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ముష్కరులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు సమాచారం అందడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తమిళనాడు డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకూ రంగంలోకి దిగారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టు కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి.

‘ఇంటెలిజెన్స్‌ నుంచి అందిన సమాచారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ విధించింది’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. కోయంబత్తూర్‌ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు.

కోయంబత్తూరులో చొరబడిన ఆరుగురు టెర్రరిస్టులు నుదుట తిలకం పెట్టుకున్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మొహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు.

మరో పక్కన.. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాకు సమీపంలో ఉన్న హరామి నాలా ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన రెండు మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేశారు.