అజింక్య రహానేకు భారీ జరిమానా

14 May, 2018 - 2:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కెప్టెన్‌ అజింక్య రహానేకు భారీ జరిమానా విధించారు. తాజాగా ముంబై ఇండియన్స్‌‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌ రేటు నమోదవడంతో రహానేపై ఐపీఎల్‌ రూ.12 లక్షల జరిమానా విధించింది.

టాస్‌ గెలిచి, బౌలింగ్‌ తీసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు మినిమమ్‌ ఓవర్‌ రేటు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ జట్టు కెప్టెన్‌ రహానేపై రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నామని, ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం స్లో ఓవర్‌ రేటుకు సంబంధించి ఇది మొదటి నేరం కావడంతో జరిమానాతో సరిపెట్టామని ఐపీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ముంబై ఇండియన్స్‌‌తో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌‌లో ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయం సాధించింది. మొదట జోఫ్రా అర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై జట్టు 168 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు జోస్‌ బట్లర్‌ చెలరేగి పరుగులు చేయడంతో అలవోకగా విజయాన్ని అందుకుంది.

గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌‌తో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌ రేటు నమోదు చేయడంతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై రూ.12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.