కర్ణాటకలో జేడీఎస్‌కు ఎంఐఎం మద్దతు

16 April, 2018 - 2:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యం వహిస్తున్న జనతాదళ్ (ఎస్)కు మద్దతు ఇస్తామని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైస్ తెలిపారు. కర్ణాటకలో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఒవైసీ స్పష్టత ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయబోమన్న ఆయన జేడీఎస్‌ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఓ జాతీయ మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన ఈ విషయం తెలియజేశారు.

‘రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్‌, బీజేపీలను ఉద్దేశిస్తూ) కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయి. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రభుత్వం రావాలి. జేడీఎస్‌‌కు మద్ధతు ఇవ్వాలని ఏఐఎంఐఎం నిర్ణయించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటాం. అవసరమైతే జేడీఎస్‌ తరపున బహిరంగ సభ నిర్వహిస్తాం’ అని అసదుద్దీన్‌ తెలిపారు.

కాగా.. గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయాలని భావిస్తోందని.. ఈ మేరకు సీట్ల పంపిణీ కోసం అక్కడి రాజకీయ పార్టీలతో అసదుద్దీన్ సంప్రదింపులు జరిపారంటూ కథనాలు వెలువడ్డాయి.