మళ్ళీ 40 పైసలు పెరిగిన పెట్రోల్

14 January, 2019 - 3:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఐదు రోజులుగా ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన పెట్రోల్ లీటర్ ధర సోమవారం కూడా మరో 40 పైసలు, డీజిల్ 53 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ రూ.70 మార్క్‌ దాటింది. సోమవారంనాటి పెంపుతో కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఆరుసార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి.

దేశంలోని ప్రధాన చమురు సంస్థలు సోమవారం లీటర్ పెట్రోల్‌‌పై 37-40 పైసలు, డీజిల్‌‌పై 49-53 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70.13కు చేరింది. కోల్‌‌కతాలో రూ. 72.24, ముంబైలో రూ.75.77, చెన్నైలో రూ.72.79గా ఉంది. డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.64.18, కోల్‌‌కతాలో రూ.65.95, ముంబైలో రూ.67.18, చెన్నైలో రూ.67.78గా ఉంది.

ఈ ఏడాది జనవరి 7న తొలిసారిగా పెరిగిన పెట్రోల్ ధరలు ఆ తర్వాత జనవరి 10 నుంచి వరుసగా ప్రతిరోజూ పెరుగుతూనే ఉండడం గమనార్హం.