చదువులో అఫ్జల్ గురు కొడుకు టాప్!

11 January, 2018 - 8:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్‌: పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్ష‌కు గురైన అఫ్జల్‌ గురు కుమారుడు గలీబ్‌ గురు చదువుల్లో దూసుకుపోతున్నాడు. జమ్ముకశ్మీర్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (బీవోఎస్‌ఈ) నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో గలీబ్ డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో గలీబ్ మొత్తం 88 శాతం మార్కలు (441 మార్కులు) సాధించాడు.2001 పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురు‌ను 2013లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అయితే, అతని కుమారుడు చదువుల్లో చక్కగా రాణిస్తున్నాడు. బారాముల్లా జిల్లా సోపోర్‌లో తల్లితో కలిసి ఉంటున్న గలీబ్‌ నివాసం వద్ద స్నేహితుల రాకతో సందడి నెలకొంది. ప్రస్తుతం గలీబ్‌ గురుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ఒరవడిని కొనసాగించాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధికార ప్రతినిధి సారా హయత్‌ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

జమ్ముకశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నవంబర్‌లో జరిగిన పరీక్షలకు మొత్తం 55,163 మంది విద్యార్థులు హాజరవ్వగా.. వారిలో 33,893 మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.44గా నమోదైంది.