అమెరికాలో భారతీయులకు ఊరట

10 November, 2019 - 10:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయులకు స్థానిక కోర్టు భారీ ఊరట కలిగించింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా పని చేసుకోవచ్చని తేల్చింది. ఇలాంటి వారికి కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ట్రంప్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ కోర్టును కోరింది. నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అంత వరకూ ట్రంప్ నిబంధనలను నిలిపి ఉంచడం ఉత్తమం అని అభిప్రాయపడింది.

హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ.. ఒబామా ప్రభుత్వం హెచ్4 వీసా విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. దీని వల్ల అనేక మంది అమెరికా వాసులు నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో హెచ్4 వీసా నిబంధనలను కఠినం చేయాలని నిర్ణయించింది.