రైళ్ళలో అదనంగా 4 లక్షల బెర్తులు

11 July, 2019 - 8:30 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశంలోని రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. వచ్చే అక్టోబరు నుంచి రైళ్లలో ప్రతిరోజూ అదనంగా 4 లక్షలకు పైగా బెర్తులు అందుబాటులోకి వస్తున్నాయి. రైల్వేలు అందిపుచ్చుకోనున్న ఆధునిక సాంకేతికత ద్వారా ఇంధన ఖర్చులను ఆదా చేయటంతో పాటు ప్రయాణికులకు సౌలభ్యాన్ని సమకూర్చుకోవచ్చని సీనియర్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చాలా రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లలో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు పనిచేయటానికి అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయటానికి డీజిల్‌తో పనిచేసే పవర్‌ కార్లను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కనీసంగా రెండు పవర్‌ కార్లు ఉంటాయి. హెడ్‌ ఆన్‌ జనరేషన్‌ (హెచ్‌ఓజీ) అనే నూతన సాంకేతికతను సమకూర్చుకోవటం వల్ల రైలు ఇంజన్లు నడవటానికి మాత్రమే హైటెన్షన్‌ లైన్ల నుంచి తీసుకుంటున్న విద్యుత్తును బోగీల అవసరాలకూ మలచుకోవచ్చు. ఈ సాంకేతికత ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉంది. రైలుపట్టాల వెంట ఉండే హైటెన్షన్‌ విద్యుత్ లైన్ల నుంచి విద్యుత్తును పొందటానికి పాన్‌టోగ్రాఫ్‌ అనే పరికరం ఉపయోగపడుతుంది. ఇంజన్లు నడపటానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు.

బోగీలకు అవసరమైన విద్యుత్తునూ హైటెన్షన్‌ లైన్ల నుంచే ఇంజన్ల ద్వారా తీసుకోవటం వల్ల డీజిల్‌ జనరేటర్లు ఉండే పవర్‌ కార్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. పవర్‌ కార్లను తొలగించి వాటి స్థానంలో అదనంగా బోగీలను అమర్చుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా బెర్తులు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. అక్టోబరు నాటికి 5వేల బోగీలను కొత్త సాంకేతికత ఆధారంగా నడిచేలా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. తొలగించిన పవర్‌ కార్‌ స్థానంలో ప్రయాణికుల బోగీని అమర్చటం ద్వారా రైలు పొడవు పెంచాల్సిన అవసరం లేకుండానే అదనంగా బెర్తులు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

డీజిల్‌తో నడిచే పవర్‌ కార్లను తొలగించటం వల్ల రైల్వేలకు ఏడాదికి రూ.6 వేల కోట్ల మేరకు ఇంధన ఖర్చులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. డీజిల్‌ వినియోగాన్ని నిలిపివేయటం వల్ల సంవత్సరానికి 700 మిలియన్‌ టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. ఆ మేరకు వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుంది.