‘ఆచారి అమెరికా యాత్ర’ రివ్యూ

27 April, 2018 - 5:00 PM

సినిమా: ఆచారి అమెరికా యాత్ర
జానర్: కామెడీ ఎంటర్‌‌టైనర్‌
నటీనటులు: మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, కోట శ్రీనివాస‌రావు, ప్రదీప్ రావ‌త్‌, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్‌, రాజా ర‌వీందర్, సురేఖా వాణి, పోసాని కృష్ణమురళి త‌దిత‌రులు.
మ్యూజిక్: ఎస్ఎస్ తమన్‌
డైరెక్షన్: జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాత: కీర్తి చౌదరి, కిట్టు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మంచు విష్ణు హీరోగా ఈడోరకం ఆడోరకం, దేనికైనా రెడీ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల దర్శకుడు నాగేశ్వరరెడ్డి- విష్ణు కాంబినేషన్‌‌‌లో వచ్చిన ఈ మూవీ వచ్చింది. మంచు విష్ణు, బ్రహ్మానందం క‌లిసి చేసిన కామెడీ సినిమాలు మంచి విజయాల‌నే అందుకున్నాయి. మరి ఈ సినిమా నాగేశ్వరరెడ్డి, మంచు విష్ణులకు ఆశించిన విజయం అందించిందా? చాలా రోజులుగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న విష్ణు తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడా? చూద్దాం.స్టోరీ: వేల కోట్ల ఆస్తులున్న చక్రపాణి (కోట శ్రీనివాసరావు) మనవరాలు రేణుక (ప్రగ్యా జైస్వాల్‌). రేణుక అంటే చక్రపాణికి ప్రాణం. అందుకే మనవరాలు బాగుండాలని తొమ్మిది రోజుల పాటు హోమం నిర్వహించాలని నిర్ణయిస్తాడు. ఆ బాధ్యతలను అప్పలాచారి (బ్రహ్మానందం) ఆయన శిష్యుడు కృష్ణమాచారి (మంచు విష్ణు)కు అప్పగిస్తారు. హోమం చేసేందుకు ఇంటికి వచ్చిన కృష్ణమాచారి, రేణుకతో ప్రేమలో పడతాడు. రేణుకకు కూడా కృష్ణమాచారి మీద ప్రేమ కలుగుతుంది. హోమం చివరి రోజు కార్యక్రమాలు జరుగుతుండగానే చక్రపాణి చనిపోతాడు. హోమం పొగ కారణంగానే చక్రపాణి చనిపోయాడని ఆయన అల్లుడు సుబ‍్బరాజు (ప్రదీప్‌ రావత్‌).. అప్పలాచారి, కృష్ణమాచారిలను చంపాలనుకుంటాడు.

అక్కడి నుంచి తప్పించుకున్న అప్పలాచారి, కృష్ణమాచారి దేశం వదిలిపోవటమే కరెక్ట్‌ అని నిర్ణయించుకుంటారు. కృష్ణమాచారి తనకు అమెరికాలో స్నేహితుడు ఉన్నాడని అబద్ధం చెప్పి అప్పలాచారిని అమెరికా తీసుకొని వెళతాడు. అసలు కృష్ణమాచారి అమెరికా వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు? చక్రపాణి నిజంగా హోమం కారణంగానే చనిపోయాడా? కృష్ణమాచారి రేణుకను ఎలా దక్కించుకున్నాడు? అనేదే ఈ సినిమా మిగతా స్టోరీ.

నటీనటులు:
మంచు విష్ణు ఇంతకు ముందు దేనికైనా రెడీ సినిమాలో కనిపించినట్టే ఇందులోనూ కనిపించాడు. దాదాపు అదే తరహా లుక్‌, క్యారెక్టరైజేషన్‌‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తన పరిథి మేరకు కృష్ణమాచారి పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌‌లో మంచు విష్ణు పెర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుంది. సీనియర్‌ నటుడు బ్రహ్మానందం తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. బ్రాహ్మణుడి పాత్రలు చేయటం బ్రహ్మీకి కొట్టిన పిండి. కానీ బ్రహ్మీని పూర్తి స్థాయిలో వాడుకునే సన్నివేశాలు సినిమాలో పెద్దగా కనిపించవు. రేణుక పాత్రలో ప్రగ్యా జైస్వాల్‌ ఆకట్టుకుంది. అభినయంతో మెప్పించిన ప్రగ్యా.. గ్లామర్‌ షోతో ఆడియన్స్‌‌ను ఫిదా చేసింది. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తెరమీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో మంచి విలనిజం పండించాడు. హీరో ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్‌, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ:
మంచు విష్ణుతో హ్యాట్రిక్‌ సక్సెస్‌ కోసం ప్రయత్నించిన నాగేశ్వరరెడ్డి పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్‌ గేమ్‌ ఆడారు. మంచు విష్ణుకు గతంలో ఘనవిజయం అందించిన దేనికైనా రెడీ తరహాలోనే కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పెద్దగా కొత‍్తదనం లేని కథా కథనాల్ని ఎంచుకున్న దర్శకుడు.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా ప్రమోట్‌ చేసినా సినిమాలో ఆ స్థాయి కామెడీ ఎక్కడా కనిపించకపోవటం నిరాశే. సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికా లొకేషన్లతో పాటు పాటలు విజువల్‌‌గా బాగున్నాయి. తమన్ అందించిన సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

సిల్లీ ప్లాట్‌, లాజిక్ లేని స‌న్నివేశాలు.. న‌వ్వించేంత కామెడీ లేక‌పోవ‌డం పూర్ స్క్రిప్ట్‌, ఎమోష‌న‌ల్‌‌గా, కామెడీ ప‌రంగా ఆక‌ట్టుకునే స‌న్నివేశాలు లేక‌పోవ‌డం సినిమాకు పెద్ద మైన‌స్‌‌గా మారింది. ఆచారి అమెరికా యాత్రలో కామెడీ ఆశించిన స్థాయిలో ఉండ‌దు. ద‌ర్శకుడు నాగేశ్వర‌రెడ్డి ఈ సినిమా చేయ‌డం వెనుక ఉద్దేశమేంటో ఆయ‌న‌కైనా స్పష్టత ఉందో లేదో!
ప్లస్ పాయింట్స్:
మంచు విష్ణు
ప్రగ్యా జైస్వాల్‌ గ్లామర్‌
యాక్షన్‌ సీన్స్‌
మైనస్ పాయింట్స్:
రొటీన్‌ కథా కథనం
కామెడీ పెద్దగా ఆకట్టుకోకపోవటం
లాజిక్‌ లేని సీన్లు