గౌరవం ఉంది.. అందుకే…

15 June, 2019 - 7:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌కతా: సమ్మెను వెంటనే విరమించాలని వైద్యులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. వైద్యులు తమ టార్గెట్ కాదని ఆమె స్పష్టం చేశారు. కానీ వైద్యులు మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు.

శనివారం కోల్‌కతాలో సీఎం మమత విలేకర్లతో మాట్లాడుతూ… వైద్యులు ఆందోళనతో వేలాది మంది రోగులు అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందని.. అందుకే ఎస్మా ప్రయోగించలేదని చెప్పారు. సమ్మె చేసిన ఏ ఒక్క వైద్యునిపై చర్యలు తీసుకోమన్నారు. వైద్యుల న్యాయబద్ధమైన డిమాండ్లను ఒప్పుకున్నామని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నీల్ రతన్ సర్కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఓ రోగి చనిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి బంధువులు ఆందోళనకు దిగి సోమవారం ఇద్దరు జూనియర్ వైద్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో జూనియర్ వైద్యులు ఆగ్రహించారు.
దాంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు.

ఈ సమ్మె పిలుపు ఇతర రాష్ట్రాలకు పాకింది. బెంగాల్‌లో వైద్యుల చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేష్ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా….శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చింది.