మహాసభలకు 40 దేశాల ప్రతినిధులు…అందరూ ఆహ్వానితులే

08 December, 2017 - 8:52 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణ భాష, యాస, జీవన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటే విధంగా తెలుగు మహాసభలను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. వారు, వీరు అనే తేడాలేకుండా  రాష్ట్రప్రభుత్వం అందరినీ ఆహ్వానిస్తోంది. దేశ, విదేశాల్లో ఉన్న రచయితలు, సంగీత, నృత్యకారులు, ఇతర రాష్ట్రాల్లోని పండితులు కూడా ఆహ్వానితులేనని ప్రకటించింది. మహాసభల కోసం ప్రత్యేక ఆహ్వానితులుగా 7,920 మంది గురువారం వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 40 దేశాలకు చెందిన 160 మంది ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి 1,167 మంది, తెలంగాణ నుంచి ఆరు వేల మందిపైగా ఉన్నారు. వీరితో పాటు విదేశాల నుంచి 37 మందిని, ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర రాష్ట్రాల నుంచి 56 మందిని ప్రత్యేకంగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అతిథులకు రవాణాఛార్జీలు చెల్లించడంతోపాటు వసతులు కూడా కల్పిస్తోంది. మహాసభల్లో తెలంగాణ చరిత్రతో పాటు వృత్తులు, రచనలు, వంటకాలపై ప్రత్యేక ప్రదర్శన (స్టాళ్లు) ఏర్పాటు చేయనున్నారు.

తెలుగు మహాసభలపై గురువారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని అన్నారు. తెలంగాణ ప్రజలతో పాటు భాషపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు, సాహితీవేత్తలు పెద్దఎత్తున సభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలుగు మహాసభలకు వచ్చే తెలంగాణ తెలుగు పండితులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మహాసభల అయిదురోజుల కార్యక్రమాల సమాచారంపై పుస్తకాన్ని ముద్రించి అతిథులు, ప్రతినిధులకు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ ఈ పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.