డివిలియర్స్ కూతురు పేరేంటంటే..

18 May, 2018 - 3:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: దక్షిణాఫ్రికా జట్టు విధ్వంసకర క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌‌కి భారత్‌‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌‌లో ఏబీ తన బ్యాటింగ్‌‌తో భారత్‌‌లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రీజులో అటూ ఇటూ జరుగుతూ ఏబీ కొట్టే షాట్స్‌‌కు భారత అభిమానులు ముగ్ధులవుతున్నారు.

మరోవైపు ఏబీ డివిలియర్స్‌కి కూడా భారత్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆర్సీబీ తరపున ఐపీఎల్ 11వ సీజన్ ఆడుతున్న ఏబీడీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌‌తో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీ తన వైవాహిక జీవితాన్ని కూడా భారత్‌ నుంచే ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.

ప్రేమకు చిహ్నమైన తాజ్‌‌మహల్ ఎదుట తన భార్య డేనియల్ డివిలియర్స్‌‌కి ‘నీతో నా జీవితాంతం జీవించాలని ఉంది, డేనియల్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ప్రపోజ్ చేసినట్లు డివిలియర్స్ గుర్తు చేసుకున్నాడు. అంతే కాకుండా తనకు కలిగే మూడో సంతానానికి ‘తాజ్’ అని పేరు పెడతానని చెప్పాడు. ఇండియాపై ఉన్న ప్రేమతో జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తన ప్రేమకు పునాది పడిన తాజ్‌మహల్‌‌కు గుర్తుగా తన బిడ్డకు ‘తాజ్ డివిలియర్స్‌’ అని పేరు పెడతానని డివిలియర్స్ చెప్పాడు.

డివిలియర్స్‌‌‌కు ఇద్దరు కుమారులున్నారు. ఏబీ డివిలియర్స్‌ జూనియర్‌ 2015లో జన్మించగా.. జాన్‌ రిచర్డ్‌ డివిలియర్స్‌ 2017లో పుట్టాడు. అయితే మూడో సంతానానికి పెట్టిన తాజ్‌ అనే పేరు మనసుకు దగ్గరగా ఉంటుందని డివిలియర్స్ తెలిపాడు.