ఏపీ విద్యార్థులకు ఇక స్కూళ్ళలోనే ఆధార్!

25 August, 2019 - 6:06 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 15 ఏళ్ళ లోపు పిల్లలకు వారి వారి పాఠశాలల్లోనే ఆధార్ నమోదు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచే ఈ సౌకర్యం అమల్లోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. తద్వారా విద్యార్థులకు ఆధార్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లోనూ 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఈ నెల 27న ఆధార్‌ సేవలపైన మండలానికి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున గుంటూరు జిల్లాలో 114 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇచ్చి, ఆ పాఠశాలలోని విద్యార్థులకు ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్‌ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. రేషన్‌ కార్డులో తల్లిదండ్రుల పేర్లకు ఈకేవైసీ అవుతున్నా పిల్లలకు కావడం లేదు. పిల్లల వేలిముద్రలను ఆధార్‌లో అప్‌డేట్‌ చేస్తేనే ఈకేవైసీకి అవకాశం ఉంటోంది. దీంతో చిన్నతనంలో ఆధార్‌ పొందిన వారికి వేలిముద్రల అవసరం పడుతోంది. దీంతో ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం వచ్చేవారితో పోస్టాఫీసులు, బ్యాంకులు, మీ సేవా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతోంది. విద్యార్థులను పాఠశాల మాన్పించి మరీ తల్లిదండ్రులు ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఇలాంటి ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్‌ అప్‌డేషన్‌ చేసే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.