హవ్వ..బాలికలు సమ్మతించడమా!?

28 September, 2017 - 1:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పీప్లీ లైవ్ సినిమా దర్శకుడు మొహమ్మద్ ఫారూఖీని అత్యాచారం కేసు నుంచి ఢిల్లీ హైకోర్టు విముక్తం చేయడంపై ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. రెండిటికీ తేడా ఎక్కడంటే ఫారూఖీ మీద అత్యాచారం ఆరోపణలు చేసింది 20 ఏళ్లకు పైగా వయసున్న అమెరికన్ యువతి కాగా ఫ్రాన్స్‌లో ఈ ఆరోపణలు చేసింది 11 ఏళ్ల మైనర్ బాలిక.

ఫారూఖీ కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అశుతోష్ కుమార్ తీర్పు మూడు సందేహాలపై ఆధారపడింది. నేరారోపణ చేసిన యువతి చెబుతున్న విధంగా ఆ సంఘటన జరిగిందా అన్నది మొదటిది. ఒకవేళ అలాగే జరిగుంటే అది ఆమె సమ్మతితో కాదా అన్నది రెండవది. ఒకవేళ ఆమె సమ్మతి లేకపోవడం అన్నది నిజమైతే అది ఫారూఖీ సరిగా అర్ధం చేసుకున్నాడా అన్నది మూడవది. హైకోర్టు న్యాయమూర్తి ఈ మూడవ సందేహం విషయంలో సంశయలాభం కింద ఫారూఖీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. దీనిపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు నిర్దోషి అనేందుకు కోర్టు ఆధారపడిన వాదన ప్రమాదకరమైన న్యాయసూత్రాన్ని నెలకొల్పుతోందని వారు పేర్కొంటున్నారు.

ఇక ఫ్రాన్స్‌లో వచ్చిన కేసులో ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన ఛార్జిషీటు దగ్గరే వివాదం మొదలయింది. ఎన్‌డి టివి రిపోర్టు చేసిన దాని ప్రకారం, 11 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వివాహితుడు అత్యాచారం చేశాడు. ముద్దు పెట్టుకోవడం ఎట్లాగో నేర్పిస్తానంటూ ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత మెట్లపై ఆ అమ్మాయిని అనుభవించాడు. తన ఇంటికి తిరిగివెళ్లిన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ మైనర్ కుమార్తెపై ఫలానా వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు.

అయితే ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు నిందితుడిపై అత్యాచారం అభియోగం మోపేందుకు నిరాకరించారు. నిందితుడు బాలికను బెదిరించాడనేందుకో, నిర్బంధించాడనేందుకో, బలవంతం చేశాడనేందుకో ఆధారాలు లేవు కాబట్టి అది పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక చర్యేనని వారు అంటున్నారు. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం దీనిని రేప్‌గా వరిగణించేందుకు వీలు లేదు. కాబట్టి రేప్ అభియోగం కాకుండా, మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడన్న అభియోగంపై విచారణ జరుపుతామని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

బాలిక తరపు న్యాయవాది ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. చిన్నపిల్లలు లైంగిక చర్యకు అర్ధవంతమైన సమ్మతి ఎప్పటికీ ఇవ్వలేరనీ, మైనర్ బాలికలపై నేరాలు జరిగినపుడు ఇలాంటి చర్చే ఉండకూడదనీ ఆయన అంటున్నారు. బాలిక తల్లి కూడా ప్రాసిక్యూషన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఫ్రాన్స్ లోని బాలల హక్కుల సంఘాలు ప్రాసిక్యూషన్ నిర్ణయంపై మండి పడుతున్నాయి. చిన్న పిల్లల విషయంలో లైంగిక చర్యకు సమ్మతి ఉందా లేదా అన్న మీమాంసే కూడదని వారు అంటున్నారు. ఆ మేరకు చట్టాలు మార్చాలని వారు కోరుతున్నారు. ఫ్రెంచ్ చట్టం ప్రకారం 15 ఏళ్ల లోపు బాలికతో లైంగిక చర్యలో పాల్గొంటే మైనర్‌తో లైంగిక సంబంధం అన్న నేరారోపణ కింద మాత్రమే ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది. ఈ నేరానికి గరిష్టంగా అయిదేళ్ల జైలు శిక్ష, 88 వేల డాలర్ల వరకూ జరిమానా విధించవచ్చు. రేప్ అభియోగం వర్తించాలంటే నిందితుడు హింసకు పాల్పడడం కానీ, హింసకు గురి చేస్తానని భయపెట్టడం కానీ జరిగుండాలి.

అదే బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ వంటి ఇతర యూరోపియన్ దేశాలలో నయితే 16 ఏళ్ల లోపు బాలికలతో సమ్మతితోనే లైంగికచర్యలో పాల్గొన్నప్పటికీ అది ఆటోమాటిక్‌గా అత్యాచారం కిందకే వస్తుంది. పిల్లలు తమపై లైంగిక అత్యాచారం జరుగుతుంటే ఎక్కువ సందర్భాలలో మిన్నకుండి పోతారనీ, దానిని సమ్మతిగా పరిగణించడం న్యాయం కాదనీ చాలామంది నిపుణుల అభిప్రాయం.