రైల్లో మంటలు.. 74 మంది బలి

01 November, 2019 - 6:13 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లాహోర్‌: రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో 74 మంది బలైపోయిన దారుణ ఘటన గురువారంనాడు పాకిస్తాన్‌లో జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు ప్రయాణీకులు ఉదయం గ్యాస్‌ స్టవ్‌లపై అల్పాహారం తయారు చేసుకుంటుండగా లియాఖత్‌పూర్‌ సమీపంలో ఒక్కసారిగా రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయని, క్షణాల్లో మంటలు వ్యాపించాయని, దాంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయని  ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఆ బోగీల్లో పిల్లలు, మహిళలు సహా సుమారు 200 మంది వరకూ ఉన్నారని, వారిలో ఎక్కువ మంది రాయివింద్‌ పట్టణంలో జరగనున్న మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నవారేనని తెలిపారు. మృతుల్లో అత్యధికులు ఇస్లాం వ్యాప్తికి కృషిచేసే తబ్లీగీ జమాత్‌ సంస్థకు చెందినవారే అని పాకిస్తాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ వెల్లడించారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం రాయివింద్‌ పట్టణంలో ఉందని, అక్కడ ప్రతీ సంవత్సరం తబ్లీజీ జితేమా అనే మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు, మత ప్రచారకులు వెళ్తుంటారని వివరించారు.

పేలుళ్లు జరిగిన సమయంలో కొందరు ప్రయాణీకుల వద్ద కిరోసిన్‌ ఉండటంతో, మంటలు మరింత వేగంగా వ్యాపించాయని మంత్రి రషీద్ అహ్మద్ తెలిపారు. మంటల భయంతో ప్రయాణీకులు వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేయడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయన్నారు. ప్రయాణీకులు గ్యాస్‌ సిలిండర్లు తీసుకువెళ్లకుండా అడ్డుకోలేకపోవడం రైల్వే సిబ్బంది పొరపాటే అని ఆయన అంగీకరించారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, గాయపడినవారికి రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు.

అయితే.. తబ్లీగీ జమాత్‌ ప్రతినిధులు మాత్రం సిలిండర్లు పేలడం వల్ల ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పేలుళ్లు జరిగాయని వారు తెలిపారు. వైర్లు కాలిన వాసన వస్తోందంటూ బుధవారం రాత్రే రైల్వే సిబ్బందికి తెలిపినా, వారు పట్టించుకోలేదని గాయపడిన పలువురు ప్రయాణీకులు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి, కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.  ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాల్లో గుర్తించడానికి వీలులేని స్థితిలో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని లియాఖత్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నదీమ్‌  జియా తెలిపారు.