మళ్లీ రెచ్చిపోయిన మావోయిస్టులు… అయిదుగురు మృతి

08 November, 2018 - 2:54 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. గురువారం దంతెవాడ జిల్లాలోని బచేలీ సమీపంలోని ఓ బస్సుపై బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీఐఎస్‌ఎఫ్‌‌ జవాన్‌ కూడా ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.

కాగా అక్టోబరు 30వ తేదీన మీడియా బృందంపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఏర్పాట్లపై కవరేజ్‌కు వెళ్లిన దూరదర్శన్‌ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ మృతి చెందిన విషయం విదితమే. అలాగే వారికి భద్రతగా వెళ్లిన ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అయితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు…. నాలుగు రోజుల్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.

మిగతా 72 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదీకాక రాష్ట్రంలో ఎన్నిక ప్రచారం పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక్క రోజు ముందు ఇలా మావోయిస్టులు దాడికి పాల్పడడం గమనార్హం. అయితే మోదీ శుక్రవారం నిర్వహించే జగదల్‌పూర్ ర్యాలీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.