ప్రభుత్వాలకు కిక్కు..ఒక్కరోజే రూ.430 కోట్లు తాగారు!

02 January, 2018 - 10:34 AM

                                                    (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మామూలు రోజుల్లోనే మద్యానికి భలే గిరాకీ. పైగా డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు ఇంకేముంది మద్యం ఏరులైపారింది. ఒక్క రోజే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. దాదాపు రూ.430 కోట్ల విలువైన మద్యం సేవించారు.

తెలంగాణలో మందుబాబులు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా విలువైన లిక్కర్ ను తాగారు. ఎక్సైజ్‌ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం డిసెంబర్‌ 31 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.207.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు  తెలిపింది.. అంతేకాదు డిసెంబర్‌ నెలలో మద్యం అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.1,700 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటాయే 600 కోట్లు దాటింది. న్యూ ఇయర్ వేడుకల్లో గ్రేటర్‌ హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలోనే ఏకంగా రూ. 125 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పాటు గ్రేటర్‌లోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాల్లో కలిపి ఈ అమ్మకాల అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు 31కి ముందు ఆరు రోజుల్లో మొత్తం 240 కోట్ల విక్రయాలు జరగ్గా ఒక్క 31 నే రూ.230 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నిజానికి మామూలు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.40 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడవుతుండగా ఏడాది చివరి రోజున మాత్రం మద్యం ఏరులై పారింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో డిసెంబరు 26-31 మధ్య రూ.102.38 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరుకుంది. ఇందులో రూ.50 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. జిల్లాల వారీగా చూస్తే విశాఖలో రూ.30 కోట్ల విక్రయాలు జరిగాయి. ఇక మందు విక్రయాల్లో బీరు జోరు కొనసాగింది. 9.02 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.