భారీ వర్షాలు, వరదలతో విలవిల్లాడుతున్న కేరళ

10 August, 2018 - 11:48 AM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం విలవిల్లాడుతోంది. రాష్ట్రంల భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని 24 డ్యాముల గేట్లను అధికారులు ఎత్తివేశారు. వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కావేరి నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇడుక్కి జిల్లాలో 11 మంది, మలప్పురంలో ఆరుగురు, వాయనాడ్‌‌లో ముగ్గురు, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కాడ్‌‌లో ఇద్దరు చొప్పున మృత్యువాతపడ్డారు.ఇడుక్కి జిల్లాలో కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు, పోలీసులు రక్షించగలిగారు. పలు ప్రాంతాల్లో వరద ధాటికి రోడ్లు దెబ్బతినడంతో పాటు భారీ వృక్షాలు నేలకూలాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆర్చ్‌ (వంపుగా ఉన్న) డ్యాముగా పేరు పొందిన చెరుతోని డ్యామ్‌‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. దీని సామర్థ్యం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి నీటిమట్టం ఏకంగా 2,399.58 అడుగులకు చేరుకుంది. వర్షాలు, వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది.ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఆర్మీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలను రంగంలోకి దించారు. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ, కేరళ చరిత్రలో తొలిసారి 24 డ్యాముల గేట్లను ఒకేసారి ఎత్తాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 10 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర సచివాలయం‌లో 24 గంటలూ పనిచేసే పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌‌వే పైకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో విమానాల ల్యాండింగ్‌‌ను అధికారులు రెండు గంటల పాటు నిలిపివేశారు.