సినిమా: 24 కిస్సెస్
నటీనటులు: అదిత్ అరుణ్, హెబ్బా పటేల్, రావు రమేశ్, నరేష్, శ్రీనివాస కప్పవరపు, రవివర్మ, అదితి మ్యాకల్ తదితరులు
సంగీతం: జోయ్ బారువా
చాయాగ్రహణం: ఉదయ్ గుర్రాల
కూర్పు: అనిల్ ఆలయం
కళ: హరివర్మ
నిర్మాణత: సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల
దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లకు గతంలో కొన్ని హద్దులు ఉండేవి. అయితే.. టాలీవుడ్లో రొమాంటిక్ కామెడీ మూవీకు ఇటీవల ఆదరణ పెరిగిందనే చెప్పాలి. ఈ కోవలో వచ్చినవే.. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్.ఎక్స్.100′ చిత్రాలు. వీటితో మూవీల్లో ముద్దులకు అలాంటి హద్దులన్నీ చెరిగిపోయాయి. అయితే.. అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాల్లో కేవలం ముద్దులే కాకుండా అందుకు తగ్గ కథ కూడా ఉంది. అందుకే అవి విజయవంతం అయ్యాయి.
ఈ మూవీల అనంతరం ప్రచారం విషయంలో దర్శక నిర్మాతలకు కొత్త దారులు ఓపెన్ అయిపోయినట్లుంది. ముద్దుల్ని ఎరగా వేసి ఆకర్షించే ప్రయత్నం వారు చేస్తున్నారు. అలా టైటిల్లోనే ముద్దులున్న ’24 కిస్సెస్’ ప్రచార చిత్రాలతో యువతరాన్ని బాగా ఆకర్షించింది. నిజానికి తెలుగు చిత్రపరిశ్రమలో కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్ల ముఖాలు తెలియకపోయినా సినిమాను ప్రేక్షకులు గుండెలకు హత్తుకొంటున్నారు. ఈ దశలో మిణుగురు లాంటి ఉత్తమ చిత్రాన్ని అందించిన అయోధ్యకుమార్ తాజాగా 24 కిస్సెస్‌తో శృంగారభరిత చిత్రాన్ని రూపొందించడం గమనార్హం.
స్టోరీ: విడుదలకు ముందే ముద్దు సీన్లతో హడావుడి సృష్టించిన 24 కిస్సెస్ మూవీకి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఆనంద్ (అదిత్ అరుణ్) చిన్న పిల్లల సినిమాలు తీసే దర్శకుడు. పెళ్లంటే నమ్మకం లేని వ్యక్తిత్వం ఆనంద్‌ది. ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం ఉన్నా… ప్రేమలో మాత్రం పడడు. ఇద్దరి మధ్యా బంధానికి ఏదో ఒక పేరు ఉండాల్సిందేనా? అంటుంటాడు. అనుకోకుండా మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వారిద్దరూ మరింతగా చేరువ అవుతారు. దాన్ని ప్రేమ అంటుంది శ్రీలక్ష్మి. అది ప్రేమ కాదంటాడు ఆనంద్. షరా మామూలే.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. తర్వాత ఆనంద్ మళ్లీ శ్రీలక్ష్మిని కలిశాడా? ఆనంద్ మనసులో ప్రేమ ఎప్పుడు పుట్టింది? ప్రేమ పుట్టినా పెళ్లంటే నమ్మకం లేని అతని జీవితంలో ఎలాంటి గందరగోళం చోటు చేసుకుంది? పెళ్లి పట్ల నమ్మకం లేకపోవడానికి కారణమేంటి? లాంటివి తెరపైనే చూడాలి.
విశ్లేషణ: ఈ తరం మధ్య బంధాల నేపథ్యంలో సాగే కథ 24 కిస్సెస్. దాన్ని దర్శకుడు 24 ముద్దులతో ముడిపెట్టాడు. కథలో ఎన్ని విషయాలు చెప్పినా సినిమాలో ఏదీ అతకలేదు. పైగా ఆద్యంతం గందరగోళంగా సాగుతుంది. ఈ సినిమాతో అయోధ్యకుమార్ ఏం చెప్పాలనుకున్నాడనే విషయం ఏమాత్రమూ అర్థం కాదు. ఒక సినిమా చూస్తున్నప్పుడు దాంట్లోని హాస్యమో, భావోద్వేగాలో మరో ఆసక్తో ఏదో ఒక అనుభూతి కలగాలి. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపూ సాగదీత అభిప్రాయం కలుగుతుంది. ఆనంద్ తన బాధను సైకో థెరపిస్ట్ మూర్తితో చెప్పుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఇద్దరి మధ్య బంధానికి ప్రేమ, పెళ్లి అనే పేరు పెట్టాల్సిన అవసరమే లేదనే ఆలోచనలున్న కథానాయకుడు.. ప్రేమపైనా, పెళ్లిపైనా నమ్మకమున్న కథానాయిక మధ్య సంఘర్షణే ఈ సినిమా. శారీరకంగా ఇద్దరూ ఒక్కటయ్యాక భిన్న అభిప్రాయాలున్న వారు ఎంతదూరం ప్రయాణం చేశారనేది ఈ కథలోని అంశం. దీనికి అయోధ్యకుమార్ తనదైన కవితాత్మకతని జోడించే ప్రయత్నం చేసి పప్పులో కాలేశాడనే చెప్పాలి.
ప్రేమని రుచి చూశానన్న కథానాయకుడు మళ్లీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నమ్మకం లేదనడం ఏంటో అర్థం కాదు. రకరకాల ముద్దులను తెర మీద చూపించడంలో ఫర్ఫెక్షన్ కనిపించింది. అయితే కథ, కథనాల్లో లోపాల కారణంగా తెరపై ఆ ముద్దులు కూడా తేలిపోయాయి. తొలిభాగంలో పేలవమైన సన్నివేశాలు, ముద్దుల జడివాన మధ్య ప్రేక్షకుడు చిక్కిపోతాడు. అర్ధంపర్థం లేని రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో బాగా సాగదీత అనిపిస్తుంది.
అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ నటన బాగుంది. పాత్రలకు తగ్గట్టుగా పరిణతితో నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. సినిమా ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇక 24 కిసెస్కు బలం, స్పెషల్ అట్రాక్షన్ హెబ్బా పటేల్ గ్లామర్. ఎలాంటి అరమరికలు లేకుండా ముద్దు సీన్లలో మునిగిపోయింది. యూత్ మదిలో గిలిగింతలు పెట్టే సీన్లలో బోల్డ్‌గా నటించింది. యూత్‌కు ఇదొక్కటే సినిమాలో నచ్చే అంశం. కీలక సన్నివేశాల్లో కూడా మంచి అభినయాన్ని ప్రదర్శించింది. హీరో అదిత్ అరుణ్ మంచి ఈజ్ ఉన్న యాక్టర్. అదిత్లో ఉండే ఎనర్జీకి తగిన పాత్ర లభించకపోవడంతో అతడి పాత్ర పెద్దగా పండలేకపోయింది. రకరకాల భావోద్వేగాలున్న పాత్రను తెర మీద ఎఫెక్టివ్‌గా, ఎలివేట్ కాలేకపోవడం ప్రధాన మైనస్. ఈ విషయంలో అదిత్ది తప్పులేదు. దర్శకుడి అంచనాల మేరకు అదిత్ తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పొచ్చు. సైకో థెరపిస్ట్‌గా కథని నడిపించే రాంమూర్తి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. అదితి మ్యాకల్ నవతరం అమ్మాయిగా కనిపిస్తుంది. నరేశ్ కథానాయిక తండ్రిగా నటనకి అంతగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించారు.
అయితే.. సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపించింది. సినిమాలో రెండు పాటలు మాత్రమే బాగున్నాయి. ఉదయ్ గుర్రాల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. గోవా, ముంబై, హైదరాబాద్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఫ్రెష్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు అయోధ్యకుమార్ కథకుడిగా, దర్శకుడిగా ఫెయిలయ్యారు. తన మేధో సంపత్తిని ఉపయోగించడంతో సినిమా గందరగోళంగా మారిపోయింది. అక్కడక్కడా మాటలు కొద్దిగా ఆకట్టుకున్నాయి.
చివరిగా ఈ మూవీలో మంచి సామాజిక సందేశం ఉన్నా అర్థం లేని లాజిక్కులతో ప్రేక్షకుల సహనానికి ఈ సినిమా పరీక్షగా నిలిచిందనే చెప్పాలి.
బలాలు:
అరుణ్, హెబ్బా పటేల్ నటన
యువతరాన్ని ఆకట్టుకునే కొన్ని సన్నివేశాలు
సినిమాటోగ్రఫి,
మ్యూజిక్
బలహీనతలు:
కథ, కథనం
సాగదీతగా అనిపించే సన్నివేశాలు