2018లో టార్గెట్ ఆ ఎనిమిది రాష్ట్రాలు!

01 January, 2018 - 12:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరుతో 2017ను ముగించిన బీజేపీ, కాంగ్రెస్, 2018లో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి మొత్తం 99 లోక్ సభ స్థానాలుండటంతో 2019 జరిగే లోక్ సభ ఎన్నికలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఈ ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటిది.

అటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీకి కూడా ఈ ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు  లోక్ సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ యేడాదిలో జరిగే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించక తప్పని పరిస్థితి.

2018లో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా వీటిల్లో నాలుగు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కీలకమైనవి. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్నది మోదీ ప్లాన్. వీటితో పాటు నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీకి కాంగ్రెస్ తో నే ప్రధాన పోటీ. ఆ తరువాత 2019లో సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.