బార్‌లో కాల్పులు: 13 మంది మృతి

08 November, 2018 - 6:59 PM

(న్యూవేవ్స్ డెస్క్) 

థౌజండ్‌ఓక్స్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి చొరబడిన ఓ వ్యక్తి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో గన్‌మెన్‌తో పాటు 13మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని… క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. బార్‌లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.

కాల్పులు జరిగే సమయంలో వంద మందికి పైగా బార్‌లోనే ఉన్నట్లు సమాచారం. పొగ వచ్చే గ్రెనేడ్లను బార్‌లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కూడా బార్‌లో చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

అక్టోబర్‌లో పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ ఆంగతకుడు ప్రవేశించి.. విచక్షరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. ఈఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తి .. పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డిన విషయం విదితమే.