బస్సు లోయలో పడి 13 మంది మ‌ృతి

14 September, 2018 - 3:50 PM


(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ మినీ బస్సు లోయలోకి పడిపోయింది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఆ మినీ బస్సు దండారన్‌ ప్రాంతంలో చీనాబ్ నదిలోకి 300 మీటర్ల లోతులోకి పడింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం సహాయక బృందాలను రంగంలోకి దింపింది.

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాజిందర్ గుప్తా అందించిన సమాచారం ప్రకారం.. కాశ్వాన్ నుంచి కిష్ట్వార్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. సహాయక చర‍్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్ట్వార్ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల పరిహారం ప్రకటించారు.ఈ ఘోర ప్రమాదంపై పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్‌‌పోర్టేషన్ కమిషనర్ ఎస్పీ వాయిద్‌ ట్విటర్‌‌లో సంతాపం తెలిపారు.