ప్రభాసే కారణమా?

22 August, 2019 - 9:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆగస్ట్ 23.. శ్రావణ శుక్రవారం అదీ శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. అందుకేనేమో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 సినిమాలు శుక్రవారం విడుదలకానున్నాయి. ఇప్పటి వరకు సినిమా విడుదల చేయాలంటే దసరా, దీపావళి, సంక్రాంతి.. ఇలా పండగలు, పబ్బాలు చూసుకునే వారు చిత్ర నిర్మాతలు. లేకుంటే స్కూళ్లు, కాలేజీలకు  సెలవులు ఇస్తే.. అప్పుడు తాము నిర్మించిన చిత్రాల విడుదలకు ముహుర్తం ఖరారు చేసేవారు.

కానీ ఆగస్ట్ 23 శుక్రవారం ఒకే రోజు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 సినిమాలు తెలుగు నాటే కాదు.. ప్రపంచంలోని తెలుగు వారి ముంగిట సందడి చేయనున్నాయి.  కాగా ఈ 11 చిత్రాల్లో దాదాపు అన్ని చిత్రాలు చిన్న సినిమాలే కావడం గమనార్హం.

కాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న చిత్రం సాహో. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అటు టాలీవుడ్‌లో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలన్ని ఆగస్ట్ 23నే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసినట్లు ఫిలింనగర్‌లో ఓ టాక్ వైరల్ అవుతోంది.