సుప్రీం కోర్టుకెక్కిన ‘పద్మావత్’ నిర్మాతలు

17 January, 2018 - 12:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమా‌పై మరోసారి వివాదాలు మొదలయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో సినిమా విడుదలపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించడంతో చిత్ర నిర్మాతలు బుధవారం సుప్రీం కోర్టుకెక్కారు. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని, తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అంగీకరించారు. దీనిపై గురువారం విచారణ జరగనుంది.

రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా రూపొందించిన పద్మావత్‌పై దేశవ్యాప్తంగా వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘పద్మావత్‌’ సినిమాకు సేన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఐదు స్వల్ప మార్పులతో పాటు సినిమా పేరును మార్చింది. దీంతో జనవరి 25న ‘పద్మావత్’ పేరుతో సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయినప్పటికీ రాజస్థాన్‌, గుజరాత్, మధ్యప్రదేశ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.