భంగపడ్డ పొలిటికల్ తండ్రులతో ‘బాప్ బచావో మంచ్’ ఆవిర్భావం

06 April, 2017 - 5:15 PM

బీబీఎం బహిరంగ సభలో ములాయం తదితర నేతలు
(వ్యంగ్యవార్తల విభాగం ప్రత్యేక ప్రతినిధి)

లక్నో, ఏప్రిల్ 6 : తన కొడుకు తనని ఘోరంగా అవమానించాడంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన నేతాజీ ములాయం సింగ్ యాదవ్ కి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తండ్రికే ఏమీ చేయలేనివాడు ప్రజలకేం ఒరగబెడతాడన్న ప్రధాని మోదీ విమర్శ అక్షర సత్యమని ములాయం ఒప్పుకోవడంతో పలువురు సీనియర్ నాయకులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు. దేశంలో తనలాగా కొడుకుని సీఎం చేసినవారెవరూ లేరనీ అయినా తనకి ఇలా జరిగిందని ములాయం వాపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల దరిమిలా కొడుకుల చేతుల్లో మోసపోయిన తండ్రులంతా లక్నోలో సమావేశమయ్యారు. వారంతా బాప్ బచావో మంచ్ (బీబీఎం) పేరుతో ఒక జాతీయ పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ములాయంను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం విశేషం. కనీసం ఈ పార్టీలోనైనా కొడుకులకు, కూతుళ్లకు ఎలాంటి పదవులు కట్టబెట్టరాదని తీర్మానించారు.ఈ సమావేశానికి కొడుకుల చేతుల్లో నానా బాధలు పడుతున్నపొలిటికల్ తండ్రులు పలువురు హాజరయ్యారు. కొడుకులతో పార్టీ నడపడంలో కష్టాలన్నీ తెలిసిన కరుణానిధి సమావేశానికి ప్రత్యేకంగా ఒక సందేశం పంపారు.
లోగడ బాలకృష్ణ, హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అఖిలేశ్ లాగే ప్రవర్తించారని సమావేశంలో పాల్గొన్న పలువురు తండ్రులు గుర్తు చేసుకున్నారు. నిజానికి ములాయం కంటే ఎంతో ముందే లోగడ ఒమర్ అబ్దుల్లాని ఫరూఖ్ అబ్దుల్లా సీఎం చేశారనీ అయినా ఆ కుమారుడు చాలా సందర్భాల్లో తండ్రి మాటని సరుకు చేయలేదనీ వారు చెప్పుకొచ్చారు. మొఘల్ చక్రవర్తుల హయాంలో ఔరంగజేబు సింహాసనం కోసం తండ్రిని ఖైదు చేయించాడనీ అలా వెనకటి రోజుల నుంచీ తండ్రులకు కొడుకులు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ వస్తున్నారనీ వారు వాపోయారు. అసలు కొడుకు పేరుతో ఉన్న కొన్ని తిట్లు ఇందువల్లే పుట్టాయని వక్తల్లో ఒకరు ఉక్రోషంగా వ్యాఖ్యానించారు. కుమారస్వామి సైతం ఇదివరలో తండ్రి దేవెగౌడకు వ్యతిరేకంగా తిరుగుబాటులాంటిది చేశారన్నారు.నారాయణ్ దత్ తివారీ కూడా ఆయన కొడుకు వల్ల నానా అగచాట్లూ పడ్డారనీ, చివరికి ఆయన గవర్నర్ గిరీ కూడా పోగొట్టుకోవలసి వచ్చిందనీ మరో వక్త ఆవేశంగా దుయ్యబట్టారు. నాడు ఇందిరా గాంధీతో  సంజయ్ గాంధీ ప్రవర్తన కూడా కొడుకుల అరాచకాలకు ఒక నిదర్శనమన్నారు.
అసలు జాతిపిత మహాత్మా గాంధీయే కొడుకు హరిలాల్ విషయంలో దెబ్బతిన్నారని సమావేశం పేర్కొంది. కేసీఆర్, చంద్రబాబు కూడా తమ పుత్రరత్నాల పోకడల విషయంలో జాగ్రత్త వహించాలని సమావేశం సుహృద్భావపూర్వకంగా సూచించింది. అనేక సినిమాల్లో కొడుకుల దాష్టీకాలని కళ్లకు కట్టినట్లు చూపించినా పొలిటికల్ తండ్రులకింకా కనువిప్పు కలగకపోవడం, బుద్ధి రాకపోవడం ఎంతో విచారకరమని సమావేశం భావించింది. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్న నానుడి తండ్రులకే తప్ప కొడుకులకు వర్తించడం లేదని వ్యాఖ్యానించింది. ఇకమీదటైనా కొడుకులను రాజకీయ వారసులుగా చేయడాన్ని నిరుత్సాహపరచాలని కోరింది. ఇదిలావుండగా సీనియర్ పితాజీ అయిన నేతాజీ ములాయం సింగ్ దేశమంతా పర్యటించి కొడుకుల అరాచకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ములాయం మొన్నామధ్య యూపీ సీఎం ప్రమాణస్వీకార సభలో అఖిలేశ్ ని చూపిస్తూ మోదీ చెవిలో గుసగుసగా చెప్పింది కూడా తన కొడుకు పనిపట్టమనేనని విశ్వసనీయంగా తెలుస్తోంది. అఖిలేశ్ హయాంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం వెనుక మతలబు ఇదేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.