బెంగళూరు అందుకే వచ్చా: చంద్రబాబు

08 November, 2018 - 6:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని ఆయన విమర్శించారు.

బెంగళూరులో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో చంద్రబాబు సమావేశమైయ్యారు. అనంతరం వారితో కలసి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరు వచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి నుంచి ఆయనతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు దేవెగౌడ మద్దతు కోరామని తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగగానే.. తమను వేధించడం ప్రారంభించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు చంద్రబాబు వివరించారు. కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది తర్వాత నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.

ఈ రోజు ఉదయం చంద్రబాబు.. కర్ణాటక రాజధాని బెంగళూరు చేరుకుని.. నేరుగా నగరంలోని పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ, కుమారస్వామి… చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. వీరి మధ్య సుమారు 40 నిమిషాల పాటు.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు.