ప్రజాసంకల్ప యాత్రలో చారిత్రక ఘట్టం

14 May, 2018 - 5:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఏలూరు: తెలుగుదేశం పాలనలో తీవ్ర ఇబ్బందులతో కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ… వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

వెల్లువలా జనం వెంటనడవగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి వద్ద వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌‌ను ఆవిష్కరించిన జగన్ మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు.
వెంకటాపురం నుంచి ఏలూరు చేరుకుని పాత బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.

ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని..
– 2007 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం (161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
-కడప జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
– కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజుల పాటు 263 కిలోమీటర్లు
– అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర
– చిత్తూరు జిల్లా: పది నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక
– నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర
– ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజుల పాటు 278 కిలోమీటర్లు
– గుంటూరు జిల్లా: పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర
– కృష్ణా జిల్లా: పన్నెండు నియోజకవర్గాల్లో 24 రోజుల పాటు 244 కిలోమీటర్లు

– పశ్చిమ గోదావరి జిల్లా: మే 13న (ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకలపేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. మాదేపల్లి వద్ద ప్రజాసంకల్ప యాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్‌‌ను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు.