గోదావరిలో ఆధిపత్యం ఎవరిదో..?

29 August, 2017 - 3:14 PM

(న్యూవేవ్స్ ప్రతినిధి)

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలలో ఆధిపత్యం చూపించాలనేది నానుడి మాత్రమే కాదు, వాస్తవం కూడా. అలాంటి గోదావరి కేంద్రంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్నాయి. కాపు రిజర్వేషన్లు అంటూ హడావుడి చేస్తున్న ముద్రగడ సొంత జిల్లా కేంద్రం కాకినాడనే. 1998లోనే బీజేపీ ఎవరితోనూ పొత్తు లేకుండా గెలిచిన పార్లమెంట్ సీట్లలో కాకినాడ ఒకటి. రాజకీయంగా ఎన్నో ప్రత్యేకతలున్న కాకినాడలో జరుగుతున్నది స్థానిక కార్పొరేషన్ ఎన్నికలే అయినప్పటికీ రాష్ట్రంలోని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.

కాకినాడ మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్‌గా మారిన తర్వాత 2005లో జరిగిన ఎన్నికే ఇప్పటి వరకూ జరిగిన ఏకైక ఎన్నిక. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్లు గెలిచి మేయర్ పీఠాన్ని కైసవం చేసుకుంది. 2014లో రాష్ట్రమంతా జరిగిన మున్సిపోల్స్ సమయంలో కోర్టు కేసుల వల్ల కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. అంటే కాకినాడ నగరపాలక సంస్థకు పుష్కరకాలం తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఇంకా కోర్టు వివాదాల వలన మొత్తం 50 డివిజన్లకు గాను రెండు డివిజన్లను వదిలేసి కేవలం 48 డివిజన్లకు మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ 39 డివిజన్లలో పోటీ చేస్తూ, మిత్రపక్షమైన బీజేపీకి 9 స్థానాలు కేటాయించింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగే 48 డివిజన్లకు తమ అభ్యర్థులను నిలబెట్టింది. 2006లో మేయర్ పీఠాన్ని గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ నేటి ఎన్నికలలో అభ్యర్థులు దొరకక, కేవలం 17 స్థానాలలో మాత్రమే పరిమితమైంది.

ఇప్పుడు కాకినాడ నగర ప్రజానీకం ఎవరికి మద్దతు తెలుపుతుందో అని యావత్ తెలుగు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. అలాగే ప్రశాంతతకు, విజ్ఞతకు మారుపేరైన కాకినాడ ప్రజలు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది