కథా రచయిత పెద్దిభొట్ల కన్నుమూత

18 May, 2018 - 4:51 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ప్రసిద్ధ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య (79) శుక్రవారం కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో నాలుగు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1938 డిసెంబరు 15న గుంటూరులో జన్మించిన పెద్దిభొట్ల ఒంగోలులో స్కూలు చదువు పూర్తిచేసుకున్నారు. విజయవాడలో పై చదువులు చదివారు. 350కి పైగా కథలు, 8 నవలలు రచించి సాహితీ రంగానికి పెద్దిభొట్ల విశేష సేవలందించారు. పెద్దిభొట్ల తాను జీవించి ఉన్న కాలంలోనే తన శరీరాన్ని గుంటూరు ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు.

పెద్దిభొట్లకు పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారం, ఏస్‌ రన్నర్‌, వీళ్ళు (కథాసంకలనం) వంటి కథలు, ముక్తి, చేదుమాత్ర నవలలు పేరు తెచ్చాయి. ఆంధ్రా లయోలా కాలేజీలో 40 ఏళ్లపాటు లెక్చరర్‌‌గా సేవలు అందించిన ఆయన 1996లో రిటైర్‌ అయ్యారు. విఖ్యాత రచయిత ‘వేయి పడగలు’ నవలా సృష్టికర్త విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడైన పెద్దిభొట్ల రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1)కు గానూ 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. రావిశాస్త్రి స్మారక సాహిత్య నిధి, గోపీచంద్ మెమోరియల్, అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ అవార్డు ఆయనను వరించాయి.
పెద్దిభొట్ల మృతిపట్ల రచయితలు, కవులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.