ఈపీఎస్ బలాన్ని నిరూపించుకోవాల్సిందే

10 September, 2017 - 8:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి సరిపడినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని, అందుకే శాసనసభలో తక్షణమే తన బలాన్ని నిరూపించుకోమని ఆదేశించాలని గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌‌రావును కోరినట్లు ప్రతిపక్ష డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ప్రతిపక్ష నాయకులతో పాటు ఆదివారం ఆయన గవర్నర్‌‌ను కలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తిపై స్పందించిన గవర్నర్ తగిన విధంగా స్పందిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. వారం రోజుల్లోగా గవర్నర్‌ స్పందించకపోతే న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్తామని హెచ్చరించారు. పళనిస్వామి ప్రభుత్వానికి కేవలం 114 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, 119 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయాన్నే గవర్నర్ ద‌ృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు.

స్టాలిన్ నేతృత్వంలో విపక్షాల నేతలు ఆదివారం సాయంత్రం రాజ్‌‌భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌ విద్యాసాగర్ రావును కలుసుకున్నారు. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ మస్లింలీగ్ నేతలు కూడా స్టాలిన్ వెంట ఉన్నారు. ఒకవేళ ‘బలపరీక్షకు ఆదేశించకపోతే గవర్నర్ నిష్పక్షపాత వైఖరిపై సందేహాలకు తావిస్తుంది’ అని స్టాలిన్ అన్నారు.

మరోవైపు తన వర్గానికి చెందిన 19 ఎమ్మెల్యేలతో టీటీవీ దినకరన్‌ క్యాంప్‌ కొనసాగిస్తున్నారు. పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలను పదవుల నుంచి తప్పుకోవాలని దినకరన్‌ వర్గం డిమాండ్ చేస్తోంది. కాగా, పరప్పన జైలులో ఉన్న శశికళను సోమవారంనాడు దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు కలిసేందుకు యత్నిస్తున్నారు.