బట్లర్ బ్యాట్‌పై బూతు.. బూతు..!

04 June, 2018 - 5:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హెడింగ్లే: ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్ జోస్‌ బట్లర్‌‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు కూడా బట్లర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్లర్ బ్యాట్‌‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం.

తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ విజయంలో బట్లర్‌ కీలకపాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయినప్పటికీ బట్లర్‌ బ్యాట్‌‌పై ఉన్న అసభ్య పదజాలం అతన్ని ఇరకాటంలో పడేసింది.రెండో టెస్టు మ్యాచ్‌ మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌‌తో పాటు బ్యాట్‌‌ను మైదానంలో ఉంచాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ బ్యాట్‌ హ్యాండిల్‌‌పై రాసిన ఉన్న అసభ్య పదజాలం కెమెరా కంటికి చిక్కింది. అదే సమయంలో దీన్ని గమనించిన అభిమానులు కూడా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌‌గా మారింది.

‘బట్లర్‌ తన బ్యాట్‌‌పై ఏమి రాసుకున్నాడో చూశారా’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు. అది వాడకూడని పదజాలం కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకసారి ఇలా వ్యవహరించకూడదు అంటూ బట్లర్‌‌కు మందలించి సరిపెట్టింది.