‘ఫోర్బ్స్‌’లో మనవాడు ఒకే ఒక్కడు!

06 June, 2018 - 2:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేరిపోయాడు. మొత్తం 2.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.158 కోట్లు) పారితోషికంతో కోహ్లి 83వ స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్‌ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి ఒక్కడికి మాత్రమే చోటు లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ఫ్లాయిడ్‌ మేవెదర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్‌ ఈ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్ కూడా లేకపోవడం గమనార్హం.

ప్రస్తుతం కోహ్లికి ఉన్న పాపులారిటీ మరెవరికీ లేదని, సోషల్‌ మీడియా ఫాలోవర్సే దీన్ని ప్రతిబింబిస్తున్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగా ప్రాచుర్యం పొందిన ఆటగాడు అని ఫోర్బ్స్ అభివర్ణించింది. ట్విట్టర్లో ఇప్పటికే కోహ్లీకి 2.5 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నట్టు వివరించింది.

ఫోర్బ్స్‌ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచ నెంబర్‌ 1గా నిలిచిన మేవేదర్‌ పారితోషికం 28.5 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.1,881 కోట్లు. మేవెదర్‌ తర్వాతి రెండో స్థానంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి, మూడో స్థానంలో సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. టాప్ 100 ఆటగాళ్ల ఉమ్మడి సంపాదన 3.8 బిలియన్ డాలర్లు. అంటే 2,580 కోట్ల రూపాయలు. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం పెరిగింది.

బీసీసీఐ ఇటీవలే విరాట్‌ కోహ్లికి ఏ+ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. పుమా, పెప్సీ, ఆడి, ఓక్లే తదితర పాపులర్‌ బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తుండడం గమనార్హం.

గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

గత ఏడేళ్లల్లో ఫోర్బ్స్‌ ప్రకటించిన ఈ జాబితాలో ఫ్లాయడ్‌ అగ్రస్థానం దక్కించుకోవడం ఇది నాలుగోసారి. టాప్-100 జాబితాలో NBAకు చెందిన 40 మంది బాస్కెట్‌బాల్ ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఒకే ఆట నుంచి ఇంత మంది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి.

2016లో ప్రకటించిన జాబితాలో ఒకే ఆటకు చెందిన ఆటగాళ్ల సంఖ్య 18గా ఉంది. అయితే 2016-17 సీజన్‌లో NBA ఆటగాళ్లు వేతనాలు ఒక్కసారిగా పెరగడంతో ఈ జాబితాలో పెద్ద మొత్తంలో వారికి చోటు లభించింది.