తాజ్‌మహల్ గేటు పీకేసిన వీహెచ్‌పీ!

13 June, 2018 - 11:26 AM

(న్యూవేవ్స్ డెస్క్

ఆగ్రా: నాలుగు దశాబ్దాల నాటి శివాలయంలోకి వెళ్ళే దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ విశ్వ హిందూపరిషత్‌ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడ్డారు. చరిత్రాత‍్మక కట్టడం తాజ్‌‌మహల్‌ పశ్చిమ ద్వారాన్ని (బసాయి ఘాట్) ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. దీంతో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజ్‌‌మహల్‌ సమీపంలోని పురాతన శివాలయానికి వెళ్లే దారిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) మూసివేస్తోందని వీహెచ్‌‌పీ సభ్యుల ప్రధాన ఆరోపణ. సిద్ధేశ్వర మహాదేవ్‌ దేవాలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నించినా నినాదాలతో దూసుకు వచ్చిన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు.

తాజ్‌‌మహల్ సహేలీ కా బుర్జ్ టిక్కెట్ల సేకరణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఇనుపచువ్వలతో వీహెచ్‌పీ శ్రేణులు దాడిచేశారు. గేటును తొలగించి, అక్కడి నుంచి సుమారు 50 మీటర్ల దూరానికి విసిరి పారేశారు. ఏఎస్‌ఐ ఏర్పాటు చేసిన సీసీటీవీని కూడా వారు ఈ సందర్భంగా ధ్వంసం చేయడం గమనార్హం.

ఎట్టకేలకు ఆందోళనకారులను నిరోధించిన తాజ్‌‌మహల్‌ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారని తాజ్‌ భద్రతా అధికారి ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు. వీహెచ్‌‌పీ సభ్యులు రవిదుబే, మదన్‌‌వర్మ, మోహిత్ శర్మ, నిరంజన్ సింగ్ రాథోడ్, గుల్లా సహా మరో 30 మందిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 ప్రకారం ఫిర్యాదు దాఖలు చేశామని ఏఎస్‌ఐ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన తెలిపారు.

తాజ్‌‌మహల్‌ చుట్టూ ఉన్న హిందూ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లను ఏఎస్‌ఐ నాశనం చేస్తోందని బీహెచ్‌‌పీ ప్రతినిధి దుబే ఆరోపించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ సత్‌‌సంగ్‌ నిర్వహించుకునే వారని దాన్ని నిలిపివేశారన్నారు. దసరా ఉత్సవాలను కూడా ఆపివేశారని మండిపడ్డారు. ఆమ్లా నవమిని నిర్వహించుకునే ఉసిరి చెట్టును ఏఎస్‌ఐ నరికివేయించిదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాలన్నింటికీ 14-15 సంవత్సరాల క్రితం సమాజ్‌‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పాలనలో స్వస్తి చెప్పారు. అయినా ఇక ముందు ఇలా జరగడానికి తాము అంగీకరించమని దుబే వాదించారు.