యూపీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఏకగ్రీవం

08 September, 2017 - 6:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా మంత్రులు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మొహసిన్‌ రజా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరెవరికీ పోటీగా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రదీప్‌ దూబే శుక్రవారం ప్రకటించారు.

శాసన మండలికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా వీరు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఐదుగురు మాత్రమే బరిలో మిగలటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రదీప్ దూబే వివరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మైనార్టీ మంత్రి మొహసిన్‌ రజా కావడం గమనార్హం.