రమణ దీక్షితులు, విజయసాయికి టీటీడీ షోకాజ్!

13 June, 2018 - 12:00 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి టీటీడీ బోర్డు నోటీసులు జారీ చేసింది. తిరుమల శ్రీవారి దేవస్థానం పరువుకు భంగం కలిగించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని వారిద్దరినీ టీటీడీ నోటీసుల్లో సంజాయిషీ కోరింది. లేదంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది.

గత నెల 15వ తేదీన చెన్నైలో రమణ దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయసాయి రెడ్డి కూడా అవే వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, చంద్రబాబు ఇంట్లో సోదాలు నిర్వహిస్తే నగలు బయటపడతాయని విజయసాయి ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారని, వీరికి నోటీసులు జారీ చేయాలని ఈ నెల 5న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు వీరిద్దరికీ పోస్టు ద్వారా నోటీసులు జారీ చేశారు.
టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొందరికి కూడా కొన్ని రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.