వరుసగా మూడో రోజు పెట్రో మంట

16 May, 2018 - 4:08 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల పుణ్యమా అని 19 రోజుల పాటు స్తబ్ధుగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నికల అనంతరం భగ్గున మండిపోతున్నాయి. వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో రాకెట్‌‌లా పైపైకి దూసుకుపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.75 మార్కును క్రాస్‌ చేసింది. ఢిల్లీలో బుధవారం లీటర్ పెట్రోల్‌ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్‌ నుంచి ఇదే గరిష్ట స్థాయి.

ఇతర మెట్రోపాలిటన్‌ నగరాలు కోల్‌‌కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. కోల్‌‌కతాలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్‌‌లో రూ.79.55గా నమోదైనట్టు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెబ్‌‌సైట్‌ డేటాలో పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్‌‌కతాలో 16 పైసలు పెరిగాయి.

మరోవైపు డీజిల్‌ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకుతూ వాహనదారుల జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటర్ డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్‌‌కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్‌‌లో రూ.72.36గా నమోదైంది.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలు పెంచకుండా స్తబ్ధుగా ఉంచాయి. దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రికార్డు స్థాయిలో పెట్రో ధరలను పెంచేస్తున్నాయి.

మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దాంతో పాటు డాలర్‌‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఈ ప్రభావం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పడుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌‌కు ప్రస్తుతం 78 డాలర్లు ఉంది.