గౌతంరెడ్డి ఆంతర్యం ఏమిటి ?

04 September, 2017 - 1:39 PM


(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ రాజకీయాలు మళ్లీ ఒకసారి వేడెక్కాయి. ఇందుకు కారణం వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు గౌతంరెడ్డి. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగవీటి రంగాపై అతను చేసిన వ్యాఖ్యలు రంగా అనుచరవర్గంలోనే కాకుండా కాపుల్లో కూడా ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. గౌతంరెడ్డి హఠాత్తుగా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది?

వంగవీటి రంగా రౌడీ కాబట్టి అతనిని హత్య చేయడం సరైన పనేనని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాటలు గురివింద గింజ సామెతకు చక్కగా సరిపోతాయి. అసలు విషయం ఏమంటే గౌతంరెడ్డి కూడా రౌడీయే. విజయవాడ పోలీసులు ఒకప్పుడు అతనిపై రౌడీ షీట్ తెరిచారు. వ్యవస్థీకృత నేరాల అదుపుకు వినియోగించే కోకా చట్టాన్ని కూడా అతనిపై ప్రయోగించారు. సిపిఐ అండతో, న్యాయవాదిగా తనకున్న సంబంధాలతో కొన్నాళ్లకు రౌడీషీట్ తీసేయించుకున్నారు.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గౌతంరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి ఉపాధ్యాయుడు. ఈ కుటుంబం కడప జిల్లా నుంచి వలస వచ్చింది. సిపిఐ సంబధాలతో గౌతంరెడ్డి ముందు విద్యార్ధి నాయకుడిగా అవతారం ఎత్తారు. నాగార్జునా యూనివర్సిటీలో న్యాయవాద విద్య అభ్యసించిన తర్వాత బెజవాడలో గౌతంరెడ్డి రాజకీయ ప్రస్తానం మొదలయింది. కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మరోపక్క ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు.

ఆ రోజుల్లో బెజవాడలో రంగా, నెహ్రూ వర్గాల ఆధిపత్యం నడుస్తుండేది. దీనిని వ్యతిరేకించిన సిపిఐ స్థానిక నాయకత్వం గౌతంరెడ్డిని ప్రోత్సహించింది. పట్టణంలోని ముత్యాలంపాడు ప్రాంతంలో గౌతంరెడ్డి ప్రజాకోర్టు మొదలయింది. సెటిల్‌మెంట్లతో, కబ్జాలతో కోట్లు ఆర్జించారు. సత్యనారాయణపురంలో ఏ అండా లేని వారి ఇళ్ల స్థలాలు బెదిరించి సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందంటే చివరికి సిపిఐ నాయకత్వం ఆయనను బయటకు పంపాల్సి వచ్చింది.

తర్వాత గౌతంరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ ప్రాపకం సంపాదించారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ ప్రారంభించిన పార్టీలో కొనసాగున్నారు. 2014 ఎన్నికలలో విజయావాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి బొండా ఉమ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు సీటు టిడిపి అభ్యర్ధి కేశినేని నానీతో కుమ్మక్కయి గౌతంరెడ్డి ఆయన నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. నానీ చేతిలో ఓడిపోయిన జగన్ పార్టీ అభ్యర్ధి కోనేరు ప్రసాద్ స్వయంగా ఈ ఆరోపణలు చేశారు.గౌతంరెడ్డి హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మొన్న ఆయన అర్జున్‌రెడ్డి సినిమాపై కూడా ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సిపి కార్పొరేటర్లను వెంటపెట్టుకుని ఆ సినిమాను నిషేధించాలంటూ రోడ్డుకెక్కారు. ఇప్పుడు టివి ఛానల్‌లో ఇంటర్వ్యూ చూస్తే ముందే సంప్రదించుకుని పని కట్టుకుని వంగవీటి రంగాపై వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం హత్యకు గురయిన మనిషిపై అలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏమాత్రం కనబడదు.

గౌతంరెడ్డి ధోరణి నచ్చక అతనిని కొంతకాలంగా పార్టీ నాయకత్వం దూరంగా ఉంచుతూ వచ్చింది. పార్టీ తరపున టివి చర్చల్లో పాల్గొనవద్దని కూడా ఆదేశించారు. దానికి తోడు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇటీవల వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఫలితంగా విజయవాడ సెంట్రల్ టికెట్ గౌతంరెడ్డిది కాకుండా పోయింది. ఇందులో వంగవీటి రంగా కుమారుడు రాధా హస్తం ఉందని గౌతంరెడ్డికి అనుమానం.
ఆ నిస్పృహతో ఈ పనికి పాల్పడి ఉండొచ్చని అనుకుంటున్నారు. పార్టీ మారే ఆలోచనతో పధకం వేసి ఉండొచ్చని కూడా వినబడుతోంది.