ఇపుడెందుకన్నదే ఆశ్చర్యం

11 July, 2017 - 6:00 PM

భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నట్లుండి ఇపుడెందుకు తలెత్తాయన్నది ఒక్కటే ఇటీవలి పరిణామాల మధ్య ఆశ్చర్యాన్ని కలిగినస్తున్న విషయం. యథాతథంగా వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ఇది భూటాన్-చైనాల మధ్య సరిహద్దు వివాదమే తప్ప, భారతదేశానికి ప్రత్యక్ష సంబంధం లేదు. భూటాన్ భౌగోళిక సమగ్రత పరిరక్షణకు, ఇతరత్రా భద్రత కోసం ఆ దేశంతో భారత్‌కు ఒప్పందం ఉంది గనుక ఆ విధంగా ఇండియా ప్రమేయం వస్తున్నది. పోతే, చుంబీ లోయకు సంబంధించిన డోక్లామ్ ప్రాంతం ఎవరిదనే ప్రశ్నపై భూటాన్, చైనాల మధ్య వివాదం బ్రిటిష్ కాలం నుంచి ఉంది. రకరకాల ఒప్పందాలు జరిగాయి గాని సమస్య తేలలేదు. అక్కడ ఇరుపక్షాలు యథాతథ స్థితిని కొనసాగించాలని, సామరస్య పూర్వక పరిష్కారానికి చర్చలు జరపాలన్నది ఆ ఒప్పందాల్లో ఒకటి. ఆ మేరకు చైనా-భూటాన్‌ల మధ్య చర్చలు అపుడపుడు జరుగుతున్నాయి కూడా. ఆ వివాదాస్పద ప్రాంతంలో పశువులను మేపుకునేందుకు వేసవి కాలంలో రెండు వైపుల నుంచి రైతులు వెళుతుంటారు. అది సమస్య కాలేదు. ఈ స్థితి పలు దశాబ్దాలుగా ఉన్నందున ఎవరూ పట్టించుకోలేదు.

అటువంటిది ఇప్పుడు అకస్మాత్తుగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఇందు గురించి భూటాన్ చెప్తున్న దానికన్న ఇండియా, చైనాల వాదనలు ప్రముఖంగా వార్తల్లో వెలువడుతున్నాయి. వీటిని కూడా యథాతథంగా పరిశీలిస్తే కనిపిస్తున్న చిత్రం ఈ విధంగా ఉంది. వివాదాస్పదం అని భూటాన్ అంటున్న భూభాగం వైపుగా, లేక అందులోకి ప్రవేశించి (దీనిపై స్పష్టత రావటం లేదు) చైనా రోడ్డును నిర్మిస్తున్నది. రోడ్డు నిర్మాణం మాటను చైనా ఇంతవరకు కాదనలేదు. అయితే, వివాదంగా మారింది ఒక ప్రదేశం కాగా తాము రోడ్డు నిర్మిస్తున్న ప్రదేశం మరొకటి అని, అయినప్పటికీ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డు నిర్మిస్తున్నామంటూ తప్పుదారి పట్టిస్తున్నారని చైనా అంటున్నది. దీనికి భూటాన్, భారత్‌ల నుంచి ఇంకా స్పందన వచ్చినట్లు లేదు.

భారతదేశంతో ఉద్రిక్తతలు చైనాకు నష్టదాయకమని వేరే చెప్పనక్కర లేదు. అయినప్పటికీ, చుంబీలోయ అనే పాతకాలపు స్వల్పమైన విషయంపై చైనా సామ-దాన మార్గంలో సాగటం గాక ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నదనేది అర్థం కాని విషయం

సమస్య ఏమంటే, ఇటువంటి విషయాలలో స్వతంత్రమైన నిర్ధారణకు వచ్చేందుకు కావలసిన సమాచారం పరిశీలకులకు పూర్తిగా ఉండదు. ఎక్కడో మారుమూల ప్రదేశం కావటం, సరిహద్దులు-రక్షణలు-దేశ ప్రయోజనాల వంటి సున్నితమైన అంశాలతో ముడిబడి ఉండడం వల్ల సమాచారాలు, చిత్రపటాల కొరత ఉండడం సహజం. ఇటువంటి వివాదాలకు సంబంధించి ఎక్కడైనా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది.

దానినట్లుంచి మరొక వైపు చూస్తే, చైనా రోడ్డు నిర్మాణం సరిగా ఎప్పుడు మొదలై, వివాదాస్పద ప్రాంతం వైపు ఎంతవరకు వచ్చింది, లేక ఆ ప్రాంతంలోకి ప్రవేశించటం కూడా జరిగిపోయిందా, అది జరిగి ఎంత కాలం అయింది, ఆ కాలమంతా ఇటునుంచి స్పందనలు ఏమిటన్నది మనకు స్పష్టంగా తెలియనట్లే, ఆ ప్రాంతంలోకి భారత సైనిక దళాలు సరిగా ఎప్పుడు, ఆ ప్రాంతంలోకి భౌగోళికంగా ఏ మేరకు ప్రవేశించాయన్నది కూడా స్పష్టంగా తెలియదు. రోడ్డు నిర్మిస్తున్నారన్న భూటాన్-ఇండియాల వాదనను చైనా కొట్టివేయనట్లే, భారత సైనికుల ప్రవేశంపై చైనా వాదనను ఇండియా కాదనటం లేదు. కనుక ఇదంతా చర్చనీయాంశమవుతున్నది.

అయితే, చైనా రోడ్డు నిర్మాణానికి స్పందనగానే భారత సైనికులు అదే ప్రాంతంలోకి ప్రవేశించారన్నది అర్థమవుతున్నది. రోడ్డు పని ఆపితే సైన్యాన్ని ఉపసంహరిస్తామని ఇండియా అంటుండగా, రోడ్డు నిర్మిస్తున్నది తమ భూభాగంలోనే తప్ప వివాదాస్పద ప్రాంతంలో కాదని, అయినప్పటికీ తమ పనులు ఆపేందుకు ప్రయత్నిస్తున్న భారత సైన్యం తన జవాన్లను ఉపసంహరించుకోవాలి తప్ప, తమ రోడ్డును ఆపే ప్రసక్తి లేదని చైనా వాదిస్తున్నది. తాజా వార్తల ప్రకారం భారత సైనికులు అక్కడ గుడారాలు వేయటం మొదలుపెట్టారు గనుక, ఇది ఇప్పటికిప్పుడు తేలకపోవచ్చు. “చర్యలు” అంటూ అట్టహాసపు ప్రకటనలు ఎట్లున్నా, ఈ స్థితిని పురస్కరించుకుని ఉభయుల మధ్య సైనిక ఘర్షణలో, యుద్ధమో జరగవచ్చునని ఎవరూ భావిస్తున్నట్లు లేరు. కనుక, గతంలో వలెనే ఇది కూడా కొద్ది కాలం పాటు ప్రతిష్టంభనలో ఉండి, తర్వాత క్రమంగా చల్లబడవచ్చు. అదే సమయంలో ఈ పరిణామాల నుంచి చైనాకు ఒకటి అర్థమై ఉండాలి. చైనా శక్తికి భయపడి ఇండియా వెనుకంజ వేయబోవటం లేదు.

దీనంతటిలో అర్థం కానిది ఒకటున్నది. సరిహద్దు సమస్యలను ఒక పక్కకు అట్లుంచి నెమ్మదిగా చర్చలేవో సాగిస్తూ, అంతకన్న ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవాలనే వైఖరిని ఇండియా చైనాలు చాలాకాలం క్రితమే తీసుకున్నాయి. అదే ప్రకారం జరుగుతున్నది. అభివృద్ధి మార్గంలో భారత్ కన్న వేగంగా ముందుకు పోతున్న చైనా అందులో భాగంగా అన్ని దేశాలను కలుపుకొనజూస్తున్నది. ఇటీవలి సంవత్సరాలలో బ్రిక్స్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్, వన్ బెల్ట్-వన్ రోడ్ వంటి పథకాలకు రూపుదిద్దింది. ఇవీ సంతృప్తికరంగా ఉన్నాయి. వన్ బెల్ట్‌ ప్రశ్నపై ఇండియాకు గల పలు అభ్యంతరాలను దూరం చేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. మరొకవైపు, తనకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న కుయుక్తులకు ఇండియాను దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఇండియాను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా సన్నిహితం చేసుకోవాలనే యోచన ఉంది. అందుకు మార్గం ఇది మాత్రం కాదు గదా. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నపుడు భారతదేశంతో ఉద్రిక్తతలు చైనాకు నష్టదాయకమని వేరే చెప్పనక్కర లేదు. అయినప్పటికీ, చుంబీలోయ అనే పాతకాలపు స్వల్పమైన విషయంపై చైనా సామ-దాన మార్గంలో సాగటం గాక ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నదనేది అర్థం కాని విషయం.

మావో అనంతరపు చైనా ఆర్థికాభివృద్ధి కోసం విజృంభిస్తుండటం, ఇప్పటికే జపాన్‌ను అధిగమించి ఇక అమెరికాను మించేందుకు ప్రయత్నించటం, మధ్యయుగాల నుంచే హాన్ జాతీయవాదానికి పేరుబడిన ఆ దేశంలో ఈ ఆర్థిక జాతీయవాదానికి సమాంతరంగా జాతీయవాదం సరికొత్త పురులు విప్పుకుంటుండటం, ఆర్థిక ధోరణి-జాతివాద ధోరణి దక్షిణ చైనా సముద్రం-అందులోని దీవుల ప్రశ్న సహా అనేక అంశాల్లో ప్రదర్శితమవుతుండటం వంటివన్నీ తెలిసినవే. ఈ మొత్తం దృశ్యాన్ని గమనించినపుడు చుంబీ లోయ పరిణామాలు అందులో ఒక చిన్న నలుసు వంటివన్నది నిజమే అయినా, వర్తమానాన్ని బట్టి, భవిష్యత్తు దృష్ట్యా కూడా ఆ వివాదం ముదరటం ఇండియా కన్న చైనాకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. స్టేక్స్ వారివే ఎక్కువ.

– టంకశాల అశోక్
సీనియర్ జర్నలిస్ట్