‘సైరా’ ఇండియన్ సినిమా అయ్యిందా?

24 August, 2017 - 11:46 AM


మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఇపుడు టోటల్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ లోగో పోస్టర్‌ను ఇటీవలే చిరు పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసారు. అదే విధంగా ఇందులో నటించబోయే ప్రధాన తారాగణం, సాంకేతికనిపుణుల వివరాలను ప్రకటించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రవివర్మన్ సినిమాటోగ్రఫి, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్, పరుచూరి బ్రదర్స్ కథా, మాటలు అందిస్తున్నారు.

అటు హిందీ, తమిళం, కన్నడ సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్, అగ్ర తారాగణం అంతా కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటంతో ఇపుడు ‘సైరా’ ఇండియన్ సినిమాగా మారింది. అయితే ఇందులో యువ హీరో విజయ్ సేతుపతికి తమిళంలో భారీ క్రేజ్ వుంది. తమిళ మక్కల్ సెల్వన్‌గా పేరు సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెమ్యునరేషన్‌ను కాకుండా కథను మాత్రమే నమ్ముకొని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు విజయ్. అలాంటి విజయ్ సేతుపతి ‘సైరా’లో నటిస్తున్నాడని తెలిసి తమిళ సినీ ప్రముఖుల నుంచి అతనికి శుభాకాంక్షలు వెల్లివెత్తుతున్నాయి.

అయితే ఈ ‘సైరా’లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుండబోతుందని తెలిసింది. సైరా నరసింహారెడ్డి పాత్రకు సపోర్ట్ చేసే ఓ యువనాయకుడిగా కనిపిస్తూనే.. చివర్లో నెగెటివ్ అంశాలతో ఈ క్యారెక్టర్ మారిపోతుందని సినీవర్గాల సమాచారం. ఈ క్యారెక్టర్‌ చాలా విభిన్నంగా వుండబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే స్టార్ హీరోగా సుపరిచితుడైనా విజయ్ సేతుపతి.. ఈ ‘సైరా’ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.