‘రాజరథం’లో ఆర్య లుక్‌కి సుదీప్ ప్రేరణ

13 March, 2018 - 3:09 PM

‘రాజరథం’లో విశ్వగా ఆర్య ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన రావడం, ఆ లుక్ పాత్ర మీద అంచనాలు పెంచింది. ఆ లుక్ వాస్తవానికి ఈగ, బాహుబలి ఫలే కిచ్చ సుదీప్ నుండి ప్రేరణ పొంది రూపొందించినది. తన కెరీర్ ప్రారంభంలో అనూప్, నిరూప్‌ల తండ్రి సుధాకర్ భండారి 90లలో రూపొందించిన ‘ప్రేమద కాదంబరి’ అనే కన్నడ టెలి సీరియల్‌కి సుదీప్ పనిచేశారు. అప్పటి నుండి అనూప్, నిరూప్‌లు సుదీప్‌ని ఊహించుకుని తమ స్టోరీ ఐడియాస్‌ని చర్చించుకునేవాళ్ళు. అనూప్ తాను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సుదీప్ అంత వరకు చేయని పోలీస్ పాత్రతో ‘యోధ’ అనే స్క్రిప్ట్ కూడా తయారు చేసుకున్నారు.

అనూప్ తన దర్శకత్వంలో షార్ట్ ఫిలిం ‘వర్డ్స్’ రూపొందించినప్పుడు అనేక అవార్డులు, ప్రశంసలు పొందింది. ఆ షార్ట్ ఫిలింకి సంబంధించి 2010లో ఒక ప్రెస్‌మీట్‌కి సుదీప్ గెస్ట్‌గా వచ్చి ఎంతో ప్రశంసించారు. అప్పట్లో ‘రాజరథం’ స్క్రిప్ట్ తొలి దశలోనే ఉంది. ఆ ప్రెస్‌మీట్‌కి సుదీప్ బ్లూ కుర్తా, జీన్స్, సాండల్స్‌లో వచ్చారు. ఆ గెటప్‌లో సుదీప్‌ని చూసిన అనూప్‌కి తన ‘రాజరథం’లోని విశ్వ పాత్ర గుర్తొచ్చింది. తాను విశ్వ పాత్ర ఆహార్యం ఎలా ఉండాలనుకున్నాడో సుదీప్ ఆ రోజు అలానే కనిపించారు.

‘రాజరథం’ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాక, అనూప్ తన భార్య, ‘రాజరథం’కి కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీతా షెట్టికి ఈ విషయం చెప్పారు. దానినే రిఫరెన్స్‌గా తీసుకుని నీతా షెట్టి ఆర్య లుక్‌ని డిజైన్ చేశారు. ఆర్య అసిస్టెంట్స్‌కి కూడా ‘రాజరథం’లోని ఆర్య లుక్ భలే నచ్చింది. ‘రాజరథం’లోని విశ్వ పాత్ర, ఆ పాత్ర ఆహార్యం ఆర్యకి అతికినట్టు సరిపోయిందని అంటున్నారు. ఆర్యని ఎక్కువగా ప్రేమికుడిగానే చూసిన తమకి తమ బాస్ కొత్త డాషింగ్ లుక్‌లో కనిపించడం చాలా బాగుంది అంటున్నారు. ఆర్య తినేప్పుడు, నిద్రపోయేప్పుడు, జిమ్‌లో కూడా డైలాగులు తన ముందే పెట్టుకుంటున్నారని, దర్శకుడు అనూప్ భండారి ఆర్యని టార్చర్ పెడుతున్నారని సరదాగా చెప్పుకొచ్చారు.

ఆర్య తన పాత్రని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు తన భాష కాదు కాబట్టి డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్ పర్ఫెక్ట్‌గా రావాలని ఎక్కువ సమయం కేటాయించి ఎన్నో రిహార్సల్స్ చేస్తున్నారు. ‘రంగితరంగ’కి అభిమాని అయిన ఆర్య, ఆ దర్శకుడి సినిమాలో తన పాత్రకి పూర్తి న్యాయం చేయాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నారు.

దర్శకుడు అనూప్ భండారి ఆర్య గురించి చెప్తూ, ‘ఆర్య పెద్ద హీరో అయినా ఎంతో వినయంగా ఉంటారు. సెట్‌లో కరెక్ట్ టైంకి ఉంటారు. పాత్ర కోసం ఏమడిగినా కాదనకుండా చేస్తారు’ అన్నారు.

రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 23న విడుదలవుతోంది. ‘జాలీ హిట్స్’ బ్యానర్‌పై అజయ్‌రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా ‘రాజరథం’ రూపుదిద్దుకుంది.