నిరసనలూ టీవీ అలవాట్ల మధ్య సారూప్యం!

16 July, 2017 - 7:44 PM

గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్‌లో వ్యాపారులు రోడ్డెక్కారు. మధ్యప్రదేశ్‌లో రైతులు కష్టపడి పండించిన పంట నేల పాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో టివి వార్తలు చూసే మహిళలు ఎక్కువయ్యారు.

ఈ మూడు అంశాలకూ మధ్య సారూప్యం ఉందా? మొదటి రెండు అంశాల మధ్య పోలిక కనబడుతూనే ఉంది. అవి రెండూ నిరసనలు. వ్యాపారుల నిరసనకు కారణం జిఎస్‌టి. రైతుల నిరసనకు కారణం పెరిగిపోతున్న రుణభారం, గిట్టుబాటు ధరలు లభించక పోవడం. ఇలాంటి పరిణామమే కాకపోయినప్పటికీ మహిళల అలవాటులో వచ్చిన మార్పు కూడా ఇక్కడ ప్రస్తావనార్హమే.

పైన చెప్పుకున్న నిరసన దృశ్యాలు గుజరాత్‌కూ, మధ్యప్రదేశ్‌కూ మాత్రమే పరిమితమని అనుకోనక్కరలేదు. జిఎస్‌టికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలలో నిరసనలు మొదలవుతున్నాయి. ఇక రైతుల విషయానికి వస్తే ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు తమ నిరసనను ఢిల్లీ బాటలో నడిపిస్తున్నారు.

ఈ పరిణామాలు దేశంలో వస్తున్న ఒకానొక ముఖ్యమైన మార్పును సూచిస్తున్నాయి. ఏనాడూ గట్టిగా మాట్లాడని వర్గాలు తీవ్ర స్థాయిలో నిరసనకు దిగుతున్నాయి. ఇండియాలో రైతుల దుస్థితి గురించి ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. వారికి సంస్థాగత రుణ సదుపాయం అందుబాటులో ఉండదు. ఆటుపోట్లు తట్టుకుని పంట పండించినా గిట్టుబాటు ధర లభించదు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లోని దళారులకు మాత్రం ఎప్పుడూ లాభమే.

ఎప్పటికప్పుడు, ఏ సీజన్‌కాసీజన్ ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవాల్సిందే. పంట పండించి దళారుల పాలు చేయాల్సిందే. రుణభారం భరించలేని స్థాయికి చేరిన తర్వాత ఆస్థులు అమ్ముకుని కూలీకి దిగడమో, పట్నం చేరి అడుక్కుతినడమో. అదీ ఇదీ కాకపోతే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం.

సూపర్ పవర్‌గా ఎదగడానికి ఉవ్విళ్లూరుతున్న దేశంలో బహుశా అన్నిటికంటే పెద్ద వైరుధ్యం ఇదే కావచ్చు. తరాలుగా ఇదే తంతు నడుస్తున్నా గుడ్ల నీరు కుక్కుకోవడం తప్ప రైతు ఏనాడూ రోడ్డెక్కి ఎరుగడు. దీనికి మినహాయింపులు లేకపోలేదు కానీ అవి లెక్కలోకి రావు. అలాంటి రైతు ఇప్పుడు ఆందోళన బాట పట్టాడు.

భారత్‌లో వ్యాపారవర్గం కూడా సంప్రదాయబద్ధంగా తలవంచుకు నడిచే తత్వం ఉన్న వర్గం. లాభార్జన అనే స్వీయ ప్రయోజనం కోసం వివిధ రకాల దారులు వెదకడం తప్ప ఇదేంటి అని ప్రశ్నించే పని ఏనాడూ లేదు. ఘర్షణకు ఆమడ దూరంలో ఉంటారన్న పేరు ఆ వర్గం సొంతం. ఇప్పుడు వారు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు.

ఈ నిరసనలు ఎంత కాలం కొనసాగుతాయో తెలియదు. క్రమేపీ చల్లారిపోవచ్చు. లేదా సంక్షోభస్థాయికి పెరగనూ వచ్చు. ఎటువంటి శక్తులు ఈ పరిస్థితిని అందిపుచ్చుకుని నాయకత్వం అందిస్తాయన్న దానిపై, మరికొన్ని ఇతర కారణాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే అసలు విషయం అది కాదు.
సంప్రదాయబద్ధంగా తల వంచుకువెళ్లే వర్గాలు తిరగబడుతున్నాయి. అదీ ఆలోచించాల్సిన విషయం.

మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో అతి పెద్ద నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. ఈ నిర్ణయం అమలు తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కారణంగా తమకు ఢోకా లేదని బిజెపి నాయకత్వం భావిస్తోంది. నిజానికి పెద్ద నోట్ల రద్దు సామాన్యుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు జిఎస్‌టి వల్ల కూడా అదే ప్రభావం ఉంటుంది. ఈ రెండు నిర్ణయాల వల్లా సామాన్యుడికి ఒరిగేది ఏమీ ఉండదు. మొదటి నిర్ణయం వల్ల అసంఘటిత రంగం తీవ్రంగా నష్టపోయింది కనుక దానిపై ఆధారపడిన వారంతా ఇబ్బందుల పాలయ్యారు. జిఎస్‌టి వల్ల కూడా జరిగేది అదే.

టివి ఛానళ్లలో పురుషులు ఎక్కువగా వార్తలు చూస్తారనీ, మహిళలు సీరియళ్లు చూస్తారనీ అందరికీ తెలుసు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని ఈ పరిస్థితి మారింది. బ్రాడ్‌కాస్టింగ్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ విడుదల చేసిన సమాచారం ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత వార్తలు చూసే మహిళల సంఖ్య 44 శాతం పెరిగింది. అంతే కాదు వార్తలు చూసేందుకు వారు వెచ్చిస్తున్న సమయం కూడా పెరిగింది.
ఈ మార్పు దేనిని సూచిస్తున్నది? తమ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న పరిణామాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మహిళలలో పెరగడం వారి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును సూచిస్తున్నది. మహిళల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు అక్కడితో ఆగదు. అది అంత తేలికగా వెనక్కి మళ్లదు కూడా. కష్టాలను మౌనంగా భరించే వర్గాలను నిరసనలు తెలిపేందుకు ప్రేరేపించిన పరిస్థితులే మహిళలను వార్తల వైపు మళ్లించాయి.

అయితే తమ నిర్ణయాల పర్యవసానాలు తమ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని బిజెపి నేతలు భావించడం లేదు. ఈ నిర్ణయాల వల్ల ప్రభావితం అయ్యే వారు దానిని మౌనంగా భరిస్తారనే కేంద్ర ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. వారు మరో రకంగా భావిస్తున్నారని అనుకునేందుకు ఇంతవరకూ మనకు ఎలాంటి సంకేతాలూ లేవు. వారికి కనువిప్పు కలుగుతుందో లేదో కానీ, రానున్న రోజుల్లో ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఎదురుకానున్న గడ్డు కాలాన్ని పైన చెప్పుకున్న పరిణామాలు సూచిస్తున్నాయి.

– ఆలపాటి సురేశ్ కుమార్