కేంద్ర మంత్రిపై సీఎం సిద్దు చిందులు

11 September, 2017 - 3:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మైసూరు: కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌‌పై కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు. సీనియర్ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌‌కు భద్రత కల్పించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందంటూ రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘గౌరీ లంకేశ్‌ ప్రాణాలకు ముప్పు ఉందని మా ప్రభుత్వానికి ముందుగా తెలిసినట్టు ఆ కేంద్ర మంత్రి చెప్పారు. ఆమె కోరినా మేం భద్రత కల్పించలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి అయి ఉండీ కూడా రవిశంకర్ ప్రసాద్ బాధ్యత లేకుండా ఈ వ్యాఖ్యలు చేశార’ని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.

మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపిన గౌరికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ.. కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ అంతకు ముందు ప్రశ్నించారు. కానీ.. తన ప్రాణానికి ముప్పు ఉందనే విషయాన్ని గౌరి తమతో చెప్పలేదని, భద్రత కూడా కోరలేదని సిద్దరామయ్య వివరించారు. గౌరీ లంకేశ్‌ చాలా మంచి మనిషి అని, ఆమెను ఎవ్వరూ ద్వేషించరని చెప్పారు.

గౌరీ లంకేశ్‌కు ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించి ఆమెకు భద్రత కల్పించారా లేదా అని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానని రవిశంకర్‌ ప్రసాద్‌ తాజాగా అన్నారు.