జూన్ 1న ప్రేక్షకుల ముందుకు ‘శరభ’

09 May, 2018 - 1:00 PM

ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శరభ’. ఈ చిత్రానికి ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించగా అశ్విన్ కుమార్ సహదేవ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. ‘సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నాం. జయప్రద ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ… ‘భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించారు నిర్మాత. అరుంధతి సినిమా తరువాత నాకు అంతటి స్పాన్ ఉన్న శరభ చిత్రం లభించింది. ఆర్ఆర్‌కు స్కోప్ ఎక్కువ ఉన్న సినిమా ఇది. పాటలు కూడా బాగా వచ్చాయి. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అన్నారు.హీరో ఆకాష్ కుమార్ మాట్లాడుతూ.. ‘అందరి కష్టమే శరభ చిత్రం. జయప్రద లాంటి సీనియర్ నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తెలుగులో ఇంత మంచి సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు.

జయప్రద మాట్లాడుతూ.. ‘చాలా గ్యాప్ తరువాత సినిమా చేయాలని ఆశ పుట్టింది. అయితే ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నరసింహ ఈ చిత్ర కథతో వచ్చారు. కథ విన్నాక తెలిసింది.. తప్పకుండా విజయం సాధిస్తుంది అనిపించింది. అందుకే అంగీకరించాను. చెప్పాలంటే ఈ చిత్రం నాకు మళ్లీ న్యూ ఎంట్రీలా అనిపిస్తోంది. రీఎంట్రీకి ఓ మలుపు తిప్పే సినిమా అవుతుందని నమ్ముతున్నా. ఈ చిత్రంలో నా పాత్ర చాలా వేరియేషన్స్‌లో ఉంటుంది. ఒక రకంగా నాకు ఛాలెంజింగ్ పాత్ర. ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తెలుగులో సినిమా చేస్తే తెలుగు బిడ్డని అనే అనుభూతి కలుగుతుంది నాకు. దైవానికి- దయ్యానికి మధ్య జరిగే సంఘర్షణే శరభ చిత్ర కథాశం. పెద్ద స్టార్ కాస్టింగ్‌తో చేసే సినిమాలా పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు నిర్మాత అశ్విన్. మంచి చిత్రంతో మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.ఈ సినిమా తనకు పెద్ద పరీక్షలా అనిపిస్తోందని, నా రిజల్ట్ వచ్చేది జూన్ 1 నాడే అన్నారు. తనను పాస్ చేసేది ప్రేక్షకులే, అని తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతకు, జయప్రదకు ధన్యవాదాలు అని అన్నారు దర్శకుడు నరసింహారావు.

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి, డా. జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్‌దీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్, మేకప్: నాయుడు, శివ, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఫైట్స్: రామ్- లక్ష్మణ్, డిజైనర్లు: అనిల్, భాను, కెమెరా: రమణ సాల్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆడియోగ్రఫీ: లక్ష్మీ నారాయణ ఎఎస్., మ్యూజిక్: కోటి, నిర్మాత: అశ్విన్ కుమార్ సహదేవ్, రచన-దర్శకత్వం: నరసింహారావు.