బిగ్‌బాస్ హౌస్‌లో తొలిరోజే సెగలు

11 June, 2018 - 10:52 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలుగు టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న బిగ్‌‌బాస్‌ సీజన్-2 ఆదివారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. సినిమాల్లో తన నేచురల్‌ నటనతో ఆకట్టుకునే నాని ఈ సీజన్‌‌లో హోస్ట్‌‌గా ఎంట్రీ ఇచ్చారు. సీజన్ 1ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ స్థానాన్ని రీప్లేస్ చేసిన ఈ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి తొలిరోజే యాంకరింగ్‌‌లో తన మార్క్‌ చూపించారు. కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా బిగ్‌‌బాస్‌ హౌస్‌లోకి ఆహ్మానిస్తూ అలరించారు.

బిగ్‌బాస్ 2 నిర్వాహకులు తొలి నుంచీ చెబుతున్నట్లే ఈసారి 13 మంది సెలబ్రిటీలతో పాటు ముగ్గురు సామన్యులకూ హౌస్‌లో అవకాశం ఇచ్చారు. వీరిలో విజయవాడకు చెందిన సంజనా అన్నే, గణేష్‌‌తో పాటు విశాఖపట్నానికి చెందిన నూతన్‌ నాయుడు ఉన్నారు.

అయితే.. బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలిరోజే సామాన్యులకు సెలబ్రిటీలు షాక్‌ ఇచ్చారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌‌లలో ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఇద్దరిని ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దీంతో తొలిరోజే కంటెస్టెంట్లకు ఊహించని షాక్ ఎదురైనట్లయింది. అయితే సెలబ్రిటీలు అందరూ మూకుమ్మడిగా సామాన్యుల నుంచి కంటెస్టెంట్‌‌లుగా వచ్చిన సంజన, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు.

బిగ్‌‌బాస్‌ ఆదేశాల మేరకు ఇద్దరిని హౌస్‌లో ఉన్న జైల్లో పెట్టి తాళం వేశారు. సోమవారం ఎపిసోడ్‌‌లో ఒకరిని జైలు నుంచి బయటకు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆ ఒకరు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముగ్గురు మాత్రమే ఉన్న సామాన్యుల్లో ఇద్దరిని షో ప్రారంభమైన వెంటనే బయటకు పంపే ఏర్పాట్లు జరుగుతుండడంపై మోడల్ సంజన అన్నే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత మంది సెలబ్రిటీలు ఉండగా తమ పేర్లను ఎలా సూచిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తొలి రోజే షో రసవత్తరంగా మారింది.