‘రంగస్థలం’ సినిమా విశ్లేషణ

30 March, 2018 - 2:31 PM

సినిమా: రంగస్థలం
జానర్: పీరియాడిక్‌ ఎమోషనల్‌ డ్రామా
నటీనటులు: రామ్‌‌చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్‌రాజ్‌, అనసూయ, అజ‌య్ ఘోష్, పూజా హెగ్డే, అమిత్ శ‌ర్మ, న‌రేశ్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం: బి. సుకుమార్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నెనీ, వై. రవిశంకర్‌, మోహన్ చెరుకూరి

తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఇటీవలి కాలంో ఊపందుకుంది. ఆ క్రమంలోనే ‘రంగస్థలం’ విలక్షణమైన చిత్రంగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌‌లో వచ్చిన పీరియాడిక్‌ డ్రామా. చరణ్‌‌తో పాటు సుకుమార్‌ కూడా తన మూస శైలికి భిన్నంగా ఈ సినిమా చేశాడు. ఇన్నాళ్లుగా కమర్షియల్‌ స్టార్‌‌గా నిరూపించుకున్న రామ్‌చరణ్‌ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాలని భావిస్తున్నాడు. వెండితెరపై లెక్కల మాస్టర్‌‌గా పేరున్న సుకుమార్‌ ఎలాంటి కన్‌‌ఫ్యూజన్‌ లేకుండా తన చిన్ననాటి అనుభవాలతో 80ల నాటి కాలాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప‍్రయత్నంలో సుకుమార్ విజయం సాధించాడా? నటుడిగా ప్రూవ్‌ చేసుకోవాలన్న చరణ్ కల నెరవేరిందా? కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలం ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకునేందుకు కథలోకి వెళదాం.రంగస్థలం 1980ల కాలంలోని ఓ గ్రామం. ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) ఆ గ్రామ ప్రెసిడెంట్‌. 30 ఏళ్లుగా గ్రామాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తుంటాడు. ఆ ఊళ్లో పొలాలకు నీరు తోడే మోటర్‌ కుర్రాడు చిట్టిబాబు (రామ్‌‌చరణ్‌). వినికిడి లోపంతో ఉన్న చిట్టిబాబు, రామలక్ష్మి (సమంత)ని చూసి ఇష్టపడతాడు. దుబాయ్‌‌లో ఉద్యోగం చేసే చిట్టిబాబు అన్న కుమార్‌‌బాబు ( ఆది పినిశెట‍్టి) ఏడాది తరువాత రంగస్థలం గ్రామంలో అడుగుపెడతాడు. రంగస్థలంలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తాడు. కుమార్‌‌కు నవభారత్ పార్టీ ఎమ్మెల్యే (ప్రకాశ్‌రాజ్) అండగా నిలుస్తాడు.

అయితే.. గతంలో ఫణీంద్ర భూపతికి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న వారంతా చనిపోయారని తెలుసుకున్న చిట్టిబాబు.. తన అన్నకు ఏమైనా జరుగుతుందేమో అని భయపడతాడు. అనుకున్నట్టే కుమార్‌ బాబును చంపేస్తారు. చనిపోయే ముందు కుమార్‌ బాబు, చిట్టిబాబుతో ఏదో చెప్పాలని ప్రయత్నించినా అది చిట్టిబాబుకు వినిపించదు. కుమార్ బాబు, చిట్టిబాబుకు ఏం చెప్పాలనుకున్నాడు? కుమార్ బాబు చావుకు ప్రెసిడెంటే కారణమా? ఈ విషయాలను చిట్టిబాబు ఎలా కనిపెట్టాడు? అన్నదే మిగతా కథ.

సినిమా అంతా చిట్టిబాబు, కుమార్‌బాబు పాత్రల చుట్టూ తిరుగుతుంది. చిట్టిబాబుగా రామ్‌‌చరణ్ నటన అద్భుతం. ఇన్నాళ్ళూ కమర్షియల్ మాస్‌ పాత్రల్లోని కనిపించిన చెర్రీ చాలెంజింగ్‌ రోల్స్‌‌లోనూ మెప్పించగలనని నిరూపించుకున్నాడు. వినికిడి లోపంతో ఇబ్బంది పడే సన్నివేశాల్లో చరణ్ నటన నవ్వులు పూయిస్తుంది. సినిమాలో హాస్యాన్ని పండిచే బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు చరణ్‌. లుక్‌‌లో విషయంలోనే కాదు యాస, భాషల విషయంలో కూడా క్యారెక్టర్‌ కోసం చరణ్ తీసుకున్న కేర్‌ తెరమీద ప్రతీ ఫ్రేమ్‌‌లోనూ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌‌లో సరదాగా కనిపించిన చరణ్‌, సెకండ్‌ హాఫ్‌‌లో బరువైన ఎమోషన్స్‌ పలికించి ఆకట్టుకున్నాడు. సుకుమార్ మలిచిన చెవిటి చిట్టిబాబు పాత్రకు రామ్‌చరణ్ జీవం పోశాడు. పాత్రలో వందశాతం పరకాయ ప్రవేశం చేశాడు. నటుడికి జీవితంలో అరుదుగా చిట్టిబాబు లాంటి పాత్రలు లభిస్తుంటాయి. వాటిని గ్రహించి మెప్పించడంలోనే నటుడిగా స్థాయి పెరుగుతుంది. చిట్టిబాబు రూపంలో వచ్చిన అవకాశాన్ని రామ్‌చరణ్ చక్కగా ఒడిసిపట్టుకొన్నాడు. ద్వితీయార్థంలో చరణ్ నటన చాలా సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌‌లో ఓ అనూహ్య మలుపు రెండో భాగంపై ఆసక్తి పెంచుతుంది.కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. సినిమా అంతా హుందాగా కనిపించిన ఆది.. ప్రీ క్లైమాక్స్‌‌లో వచ్చే సన్నివేశాల్లో సూపర్బ్‌ అనిపించాడు. రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది. గతంలో ఎన్నాడూ కనిపించినంత మాస్ పాత్రలో కనిపించిన సామ్‌ చిలిపి ఎక్స్‌‌ప్రెషన్స్‌‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్‌ సీన్స్‌‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ హీరోయిన్‌‌గానే ప్రేక్షకులకు సమంత తెలుసు. కానీ రంగస్థలంలో రామలక్ష్మి పాత్రను చూస్తే సమంత ఎక్కడా కనిపించదు. అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిలా ఉంటుది. కట్టు, బొట్టు, హావభావాలతో సమంత జీవించింది. కీలక సన్నివేశాల్లో సమంత కళ్లతో పలికించిన హావభావాలు ప్రేక్షకుడిని మైమరిపిస్తాయి.

పదవి కోసం ఏమైనా చేసే క్రూరమైన ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు మంచి విలనీ పండించాడు. జగపతిబాబు ఆహార్యం కూడా పాత్రకు తగ్గట్టు ఉంది. వెండితెర మీద మంచి క్యారెక్టర్‌ కోసం ఎదురుచూస్తున్న అనసూయకు రంగస్థలంలో ఆ చాన్స్‌ దక్కింది. రంగమ్మత్తగా కీలక పాత్రలో కనిపించిన అనసూయ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఎమోషనల్‌ సీన్స్‌‌లోనూ మెప్పించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్‌రాజ్, నరేష్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఎవరికీ అర్థం కానీ కథనంతో ఇబ్బంది పెడతాడనే అపవాదు సుకుమార్‌‌కు ఉంది. అందుకే రంగస్థలం సినిమా మొదలైనప్పుడే ఈ సినిమాలో అలాంటి ప్రయోగాలేవీ చేయటం లేదని, ఈ సినిమాలో లెక్కల పాఠాలేవి ఉండవని చెప్పేశాడు సుకుమార్‌. రంగస్థలం.. సుకుమార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నమైన సినిమా. 1980ల నాటి కాలాన్ని వెండితెర మీద రీక్రియేట్‌ చేస్తూ సుక్కు చేసిన ప్రయత్నం సూపర్బ్‌. ప్రతీ ఫ్రేమ్‌‌లో ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు సినిమా యూనిట్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. పూర్తిగా ప్రేక్షకులను దాదాపు 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడంలో సుకుమార్ బృందం విజయవంతం అయిది.గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలపడంలో దర్శకుడు సుకుమార్ సఫలమయ్యాడు. పల్లెటూరి ప్రజల సమస్యలు, పగలు ప్రతీకారాలతో పాటు మనుషుల్లోని అమాయకత్వం, మంచితనాన్ని కూడా తెర మీద చాలా బాగా ఆవిష్కరించాడు సుకుమార్‌. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. కామెడీతో పాటు యాక్షన్‌, కాస్త రొమాన్స్‌, ఎమోషన్స్‌‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాను తెరకెక్కించాడు. అయితే తను అనుకున్న కథను సుధీర‍్ఘంగా చెప్పిన సుకుమార్‌ కాస్త విసిగిస్తాడు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టు. కథపై పట్టు సడలకుండా దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుందని చెప్పవచ్చు.

సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం. 80ల నాటి కథకు తగ్గ బాణీలతో సినిమా విడుదల‌కు ముందు అంచనాలు పెంచేశాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలోనూ ఏ మాత్రం కమర్షియల్ వాల్యూస్‌ తగ్గకుండా సూపర్బ్‌ సాంగ్స్‌‌తో అలరించాడు. నేపథ్యం సంగీతంతోనూ ప్రేక్షకులను ఫ్లాష్‌‌బ్యాక్‌‌లోకి తీసుకెళ్లాడు. తన శైలికి పూర్తి భిన్నంగా ప్రయత్నించిన దేవీ శ్రీ ప్రసాద్‌ ఆకట్టుకున్నాడు. రత్నవేల్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌‌ను క్యారీ చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడిటింగ్‌‌పై మరికాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 1980ల నాటి కాలాన్ని తెర మీదకు ఆవిష్కరించేందుకు నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు. రంగస్థలం మూవీ కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఆ ఊరి ప్రజ‌ల‌ను ప్రెసిడెంట్ చంపేశాడ‌ని ఆ ఊళ్ళోనే చిట్టిబాబుకి రంగ‌మ్మ చెప్పే వ‌ర‌కు తెలియ‌క‌పోవ‌డం.. వారేదో ప్రమాద‌వ‌శాత్తు చనిపోయారనుకోవ‌డం నప్పలేదు. ఊర్లోనే చనిపోయిన రంగ‌మ్మత్త భ‌ర్త గురించి ఊరి ప్రజ‌లకు తెలియ‌క‌పోవ‌డం ఏంటో.. ఊర్లోని చ‌నిపోయిన భ‌ర్త దుబాయ్‌‌కి వెళ్లిన‌ట్లు ఆమె చెప్పడ‌మేంటో అర్థం కాదు.

చివరిగా తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దేళ్ళవుతున్న రామ్‌‌చ‌ర‌ణ్‌‌కు `రంగ‌స్థలం` మూవీ బెస్ట్‌ అనేప్పాలి.

ప్లస్ పాయింట్స్:
రామ్‌చరణ్ సహా ప్రధాన పాత్రధారుల నటన
కథ
ఎమోషనల్‌ సీన్స్‌
సినిమాటోగ్రఫీ
సంగీతం, బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్‌
ఆర్ట్ డైరెక్షన్‌
మైనస్ పాయింట్స్:
కొన్ని సాగదీత సీన్లు
స్లో నెరేష‌న్‌
లాజిక్ లేని కొన్ని స‌న్నివేశాలు