కనెక్షన్‌ ఒకటే సేవలు మూడు..!

27 December, 2017 - 8:43 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఏపీలో బృహత్తర కార్యక్రమం ప్రారంభంకానుంది. రాష్ట్రాన్ని ‘డిజిటల్ ఏపీ’గా తీర్చిదిద్దే ఆ ప్రాజెక్టు ‘ఫైబర్ గ్రిడ్’. ఇందులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు సేవలు లభిస్తాయి. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, 250 వరకు టీవీ చానళ్లను ఈ కనెక్షన్‌తో పొందవచ్చు. అది కూడా చౌక ధరలోనే. అపరిమిత కాలింగ్ సదుపాయం, వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ కూడా చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును బుధవారం రాష్ట్రపతి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,613 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. తొలుత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆటంకాలు ఎదురయ్యాయి. భూగర్భంలో హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ లైన్లు వేయడానికి రూ. 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తేలడంతో కరెంటు స్తంభాల ఆధారంగా 23,800 కిలోమీటర్ల మేర రూ.330 కోట్ల ఖర్చుతో ఓఎఫ్‌సీ లైన్లు వేశారు. టెలిఫోన్, మొబైల్ సేవలు అస్సలు అందుబాటులో లేని 3,060 గ్రామాల్లో 60 గ్రామాలకు కూడా ఈ లైన్లు వేశారు. ఈ గ్రామాల్లో రేపటి నుంచి ఫోన్లు రింగవనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని అన్ని ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. లైన్లు వేయలేని చోట ఫ్రీ స్పేస్ ఆప్టిక్ కనెక్షన్ (ఎఫ్ఎస్‌సీ) పరిజ్ఞానంతో కనెక్షన్లు ఇచ్చారు. ఫలితంగా 20 కిలోమీటర్ల పరిధిలో వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు దశలవారీగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ప్రభుత్వం అందిస్తున్న ఈ మూడు సేవలకు గాను రూ.235 వసూలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 4 వేల పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక ఇంటికిగానీ, సంస్థకుగానీ ఫైబర్‌ నెట్‌ సేవలందించాలంటే రెండు రకాల బాక్సులు అవసరం అవుతాయి. ఇళ్లకు జిపాన్‌ బేసిక్‌, ఐపీటీవీ బాక్సులు ఇస్తారు. ఈ రెండిటినీ కలిపి కస్టమర్‌ ప్రెసిసెస్‌ ఎక్విప్‌మెంట్‌ (సీపీఈ)గా వ్యవహరిస్తారు. ఇంత వరకు 3.8 లక్షల జిపాన్‌ బాక్సులు, 1.21 లక్షల ఐపీటీవీ బాక్సులు వచ్చాయి. తాజాగా జిపాన్‌, ఐపీటీవీ బాక్సులు రెండూ కలిపి ఒకే బాక్స్‌గా వస్తున్నాయి. అలాంటి బాక్సులు 50 వేల వరకు వచ్చాయి.

ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లకు నెలకు రూ.235 చొప్పున వసూలు చేస్తారు. దీనిలో రూ.149 ఛార్జీ, రూ.35-36 పన్నులు, రూ.50 ట్రిపుల్‌ ప్లే బాక్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌. నెలవారీ ఛార్జీగా వసూలు చేసే రూ.149లో రూ.110 ఎంఎస్‌ఓ, కేబుల్‌ ఆపరేటర్లకు, రూ.39 ప్రభుత్వానికి వెళుతుంది. ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లను బేసిక్‌ (రూ.149), స్టాండర్డ్‌ (రూ.399), ప్రీమియం (రూ.599) అని మూడు విభాగాలుగా చేశారు. పన్నులు, ఇన్‌స్టాల్‌మెంట్‌ అదనం. సంస్థలకు ఇచ్చే కనెక్షన్లలోను ఈ మూడు విభాగాలు ఉన్నాయి. రూ.999, రూ.1499, రూ.2499గా ఛార్జీలు నిర్ణయించారు. ఇళ్లకు బేసిక్‌ ప్యాకేజీలో 250 టీవీ ఛానళ్లు, 15 ఎంబీపీఎస్‌ వేగంతో 5 జీబీ ఇంటర్నెట్‌, 1 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తారు. 250లో 90 పే ఛానళ్లు, మిగతావి ఫ్రీ చానళ్లు ఉంటాయి.