అందుకే హత్య చేశా!

13 September, 2017 - 12:27 PM


(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: క్షణికావేశంలోనే చాందిని జైన్‌ను హత్య చేసినట్టు ఆమె ప్రియుడు సాయికిరణ్‌ రెడ్డి పోలీసులకు వెల్లడించాడు. చాందిని హత్య కేసులో సాయికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా చాందినితో పరిచయం, హత్యపై సాయికిరణ్ పలు విషయాలు పోలీసులకు వివరించాడు. తానే నేరం చేసినట్టు పోలీసులు ఎదుట సాయికిరణ్ ఒప్పుకున్నాడు. చాందినితో తనకు ఆరేళ్లుగా పరిచయం ఉందని సాయికిరణ్ తెలిపాడు. ప్రేమ వ్యవహారంలో తామిద్దరికీ గొడవ జరిగిందని, క్షణికావేశంలో ఆమెను చంపానని చెప్పినట్టు తెలుస్తోంది.

‘ఆరేళ్ల నుంచి చాందినితో పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం ఆమెను నాకు దూరం చేశారు. కానీ చాందిని మాత్రం నన్ను దూరం చేసుకోలేదు. పెద్దవాళ్లకు తెలియకుండా మా స్నేహం కొనసాగింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి తెచ్చేది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం కలుద్దామని తానే ఫోన్‌ చేసింది. నేను చాందిని ఇంటికి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ కలుసుకునే అమీన్‌పూర్‌ ప్రాంతానికి ఆటోలో వెళ్లాం. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కెరీర్‌లో సెటిలైన తర్వాత చేసుకుందామని చెప్పినా వినకుండా గొడవకు దిగింది. కోపంతో ఆమెను కొట్టాను. గట్టిగా కేకలు పెట్టడంతో ఆమె గొంతు పట్టుకున్నాను. చాందిని స్పృహ తప్పిపడిపోయిందనుకుని నా స్నేహితులకు ఫోన్‌ చేసి సమచారం ఇచ్చా. ఈ సంఘటన అంతా 5 నిమిషాల్లో జరిగిందని పేర్కొన్నాడు. ఫ్రెండ్స్‌ వచ్చి ఆమె చనిపోయిందని చెప్పారు. భయంతో అక్కడి నుంచి పారిపోయా’నని పోలీసులతో సాయికిరణ్‌ చెప్పినట్టు సమాచారం.

చాందిని ప్రవర్తన నచ్చక 6 నెలల నుంచి దూరం పెట్టినట్లు సాయికిరణ్ తెలిపాడు. తన వెనుక పడొద్దని ఎన్ని సార్లు చెప్పినా చాందిన వినలేదు, అయినా తన వెంట పడడం మానలేదని వివరించాడు. చాందినిని ఎలాగైనా వదిలించుకోవాలని చూశా, అమీన్‌పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేశానని చెప్పాడు.చాందిని హత్య జరిగిన అమీన్‌పూర్‌ గుట్టల్లోకి సాయికిరణ్‌ను పోలీసులు బుధవారం తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ద్వారా తెలుసుకున్నారు. హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాయికిరణ్‌ ఒక్కడే ఈ హత్య చేసివుండడని, మరికొందరు సహకరించి ఉండొచ్చని చాందిని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దోషులకు కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.