జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం

13 September, 2017 - 9:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అహ్మదాబాద్‌: జపాన్‌ ప్రధాని షింజో అబే రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్యట‌న కోసం బుధవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. షింజో అబే సతీ సమేతంగా ప్రత్యేక విమానంలో గుజరాత్‌ వచ్చారు. షింబో విమానం దిగ‌గానే మోదీ ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నారు.

సైనిక వందనం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీతో క‌లిసి రోడ్ షోలో షింబో పాల్గొన్నారు. అక్కడి నుంచి మహాత్మాగాంధీ స‌బ‌ర్మతి ఆశ్రమానికి వెళ్లారు. జపాన్ ప్రధాని షింజో అబెకు 9 కిలోమీట‌ర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది స్వాగ‌తం ప‌లికారు. మోదీతో కలిసి ఆయన స‌బ‌ర్మతీ ఆశ్రమంతో పాటు సిద్ది స‌య్యద్ మసీదును సందర్శించారు. ఇండో- జపాన్‌ వార్షిక సదస్సు సహా పలు కార్యక్రమాల్లో ఇద్దరు ప్రధానులు పాల్గొంటారు. గురువారం నాడు అహ్మదాబాద్- ముంబై మ‌ధ్య ఇండియా తొలి బుల్లెట్ రైలు ప‌నుల ప్రారంభ కార్యక్రమంలో షింజో అబే పాల్గొంటారు.

జపాన్‌ ప్రధాని రాక సందర్భంగా అహ్మదాబాద్‌లో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్‌ స్క్వాడ్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌‌లు, ఎన్‌ఎస్‌‌జీ కమాండోల బృందం పహరా కాస్తున్నాయి.