టీనేజ్‌లోనే వారికి ‘తొలి అనుభవం’!

28 May, 2018 - 4:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మన దేశంలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలు టీనేజ్ వయసులోపే తొలి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారట. 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడే పలువురు అమ్మాయిలు లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) వెల్లడించింది. భారతీయుల లైంగిక జీవితంపై సర్వే నిర్వహించిన ఆ సంస్థ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికతో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దక్షిణ భారత దేశంతో పోలిస్తే, ఉత్తరాదిలోని వారు లైంగిక జీవితాన్ని మెరుగ్గా పొందుతున్నారని, పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2015-16లో ఈ సర్వే నిర్వహించిన ఎన్ఎఫ్ హెచ్ఎస్ దాని వివరాలను తాజాగా విడుదల చేసింది. వివిధ గ్రూపుల వయసులో ఉన్న లక్ష మంది పురుషులు, మరో లక్ష మంది మహిళలను సర్వేలో భాగం చేసింది ఎన్ఎఫ్‌హెచ్ఎస్ సంస్థ.

ఈ సర్వేలోని వివరాల ప్రకారం.. 10 నుంచి 14 ఏళ్ల వయసున్న వారిలో నూటికి ఇద్దరు పురుషులకు, 10 శాతం మంది స్త్రీలకు తొలి లైంగిక అనుభవం దగ్గరవుతోంది. ఇక 15 నుంచి 19 ఏళ్ల మధ్య 23 శాతం పురుషులు, 57 శాతం స్త్రీలు, 20 నుంచి 24 ఏళ్ల మధ్య 42 శాతం మంది పురుషులు, 24 శాతం మంది స్త్రీలు, 24 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 23 శాతం మంది పురుషులు, 5 శాతం మంది స్త్రీలు తొలి లైంగికానందాన్ని పొందుతున్నారు.30 ఏళ్ల తరువాత మాత్రమే 10 శాతం మంది పురుషులకు ఆ ఆనందం దగ్గరవుతుండగా, ఈ గ్రూప్‌లో కేవలం నూటికి ఒక్కరు మాత్రమే ఆడవారు ఉంటున్నారని సర్వే తేల్చింది.

అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ తెలిపింది. పెళ్లికి ముందు సెక్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ, 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్‌లో పాల్గొన్నట్టు వెల్లడించింది ఆ సర్వే నివేదిక.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 35 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం మంది తాము చాలా రోజుల నుంచి సెక్స్‌లో చురుకుగా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అనుకోకుండా కలిసిన అమ్మాయితో లైంగికానందం పొందామని చెప్పిన పురుషుల శాతం 20 ఉండగా, తొలి అనుభవం కోసం వేశ్యను ఆశ్రయించామని చెప్పిన వారి శాతం 16 ఉంది. ఇక తమ బాయ్‌ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌తో కలిశామని 68 శాతం మంది పురుషులు, 64 శాతం మంది మహిళలు వెల్లడించారు.