ఇండియాకు ఇజ్రాయెల్ ప్రధాని

14 January, 2018 - 10:05 AM

                                                  (న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నెతన్యాహుకు, ఆయన సతీమణి సారాకు విమానాశ్రయంలో ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలుకనున్నట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ ఇండియాకు వచ్చి వెళ్లిన తరువాత, మళ్లీ ఆ దేశ ప్రధాని రావడం ఇదే తొలిసారి. అధికారిక స్వాగత కార్యక్రమాల అనంతరం వీరిరువురూ తీన్ మూర్తి స్మారకచిహ్నం వద్దకు వెళ్లి, వంద సంవత్సరాల క్రితం హైఫా యుద్ధంలో పాల్గొన్న మూడు భారత రెజిమెంట్లలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక సోమవారం నెతన్యాహూ, సారా దంపతులు ఆగ్రా వెళ్లి, తాజ్ మహల్ ను సందర్శించనున్నారు. మోదీ, నెతన్యాహు గుజరాత్ లో కూడా పర్యటించనున్నారు. నెతన్యాహూ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి.

గత జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లగా, ఆయనకు ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. అంతే స్థాయిలో నెతన్యాహూకు ఆతిథ్యం ఇవ్వాలని, భారత పర్యటన ఆయనకు గుర్తుండి పోయేలా చూడాలని ప్రధాని భావిస్తున్నారు.